Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ఆమోసు 6
సంతృప్తి గలవారికి శ్రమ
సీయోనులో సంతృప్తిగా ఉన్నవారికి శ్రమ,
సమరయ పర్వతం మీద ఆధారపడి ఉన్న మీకు శ్రమ,
ఇశ్రాయేలు ప్రజలకు సలహాదారులుగా ఉన్న,
గొప్ప దేశాల్లో ప్రముఖులైన మీకు శ్రమ!
మీరు కల్నేకు వెళ్లి చూడండి;
అక్కడినుండి హమాతుకు1 వెళ్లండి,
తర్వాత ఫిలిష్తీయలోని గాతుకు వెళ్లండి.
మీ రెండు రాజ్యాల కంటే అవి గొప్పవా?
వాటి నేల మీకంటే పెద్దది కాదా?
ఆపద్దినం దూరంగా ఉందనుకుని,
దౌర్జన్య పరిపాలనను త్వరగా రప్పిస్తున్నారు.
మీరు దంతపు మంచాల మీద పడుకుంటారు,
పరుపులపై ఆనుకుంటారు.
శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను,
శాలలోని క్రొవ్విన దూడలను మీరు తింటారు.
మీరు దావీదులా సితారా వాయిస్తూ
వాయిద్యాలు మెరుగుపరుస్తారు.
మీరు ద్రాక్షరసం పాత్ర నిండా నింపుకొని త్రాగుతారు,
పరిమళ తైలాలు పూసుకుంటారు,
కాని మీరు యోసేపు నాశనం గురించి విచారపడరు.
కాబట్టి బందీలుగా మొదట దేశాంతరం పోయే వారిలో మీరు ఉంటారు;
మీ ఉత్సవాలు, మీ విలాసాలు గతించిపోతాయి.
యెహోవా ఇశ్రాయేలు గర్వాన్ని అణచివేయుట
ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసి, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు:
“నేను యాకోబు గర్వాన్ని అసహ్యించుకుంటున్నాను
అతని కోటలను ద్వేషిస్తున్నాను;
నేను పట్టణాన్ని దానిలో ఉన్న అంతటితో
శత్రువు వశం చేస్తాను.”
ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా, ఆ శవాలను ఇంట్లోనుండి తీసుకుపోయి వాటిని దహనం చేయడానికి వచ్చిన బంధువు ఇంట్లో దాక్కొని ఉన్నవానితో, “నీతో ఇంకెవరైన ఉన్నారా?” అని అడిగితే, “లేదు” అని అతడు చెప్తే, “మాట్లాడకు, మనం యెహోవా పేరును ప్రస్తావించకూడదు” అని అంటాడు.
ఎందుకంటే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా,
పెద్ద కుటుంబాలు ముక్కలుగా విడిపోతాయి
చిన్నా కుటుంబాలు చీలిపోతాయి.
గుర్రాలు బండ మీద పరుగెత్తుతాయా?
బండ మీద ఎవరైనా ఎద్దులతో దున్నుతారా?
కాని న్యాయాన్ని విషంగా మార్చారు,
నీతి ఫలాన్ని చేదుగా మార్చారు.
లో దెబారును2 జయించి ఆనందిస్తున్న మీరు,
“మా సొంత బలంతోనే కర్నాయీమును3 పట్టుకోలేదా?” అంటారు.
అయితే సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు,
“ఇశ్రాయేలూ, నేను నీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను,
అది నిన్ను హమాతు మొదలుకొని అరాబా లోయవరకు
ఆ అరణ్య మార్గమంతా నిన్ను హింసిస్తుంది.”
Source notes (3)
- Footnote అంటే మహా హమాతు
- Footnote లో దెబారును అంటే ఏమి లేదు
- Footnote కర్నాయీమును అంటే కొమ్ములు ; కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.