Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

అపొస్తలుల కార్యములు 14

ఈకొనియలో పౌలు బర్నబాలు

ఈకొనియ పట్టణంలో పౌలు బర్నబాలు ఎప్పటిలాగే యూదుల సమాజమందిరంలో ప్రవేశించి వాక్యాన్ని చాలా ప్రభావవంతంగా మాట్లాడినప్పుడు చాలామంది యూదులు గ్రీసు దేశస్థులు నమ్మారు. కాని నమ్మని యూదులు, యూదేతరులను రేపి, సహోదరులకు విరోధంగా వారి మనస్సుల్లో ద్వేషాన్ని పుట్టించారు. అయినా పౌలు బర్నబాలు ప్రభువు కోసం ధైర్యంగా మాట్లాడుతూ చాలా కాలం అక్కడే ఉండి, ప్రభువు గురించి బోధిస్తూ ఉండగా, ప్రభువు వారి ద్వారా సూచకక్రియలను అద్భుతాలను చేయించి తన కృపా సందేశాన్ని రుజువుపరిచారు. ఆ పట్టణ ప్రజల్లో కొందరు యూదుల పక్షంగా మరికొందరు అపొస్తలుల పక్షంగా విడిపోయారు. యూదులు యూదేతరులు తమ నాయకులతో కలిసి, వారిని రాళ్లతో కొట్టి చంపాలని తలంచారు. కానీ వారు ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడినుండి లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర దెర్బే పట్టణాలకు వాటి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్లి, అక్కడ సువార్త బోధించుటను కొనసాగించారు.

లుస్త్ర దెర్బే పట్టణములలో

లుస్త్రలో కుంటివాడొకడు అక్కడ కూర్చుని ఉన్నాడు. వాడు పుట్టుకతోనే అలా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు నడవలేదు. అతడు పౌలు చేసే బోధను వినేటప్పుడు, పౌలు సూటిగా అతనివైపు చూసి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, అతనితో, “లేచి నీ కాళ్లమీద నిలబడు!” అని బిగ్గరగా అనగానే అతడు గంతులువేసి నడవసాగాడు.

పౌలు చేసిన కార్యాన్ని జనసమూహం చూసి, వారు లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవరూపంలో మన కోసం దిగి వచ్చారు” అని కేకలు వేశారు. బర్నబాకు జ్యూస్ అని, పౌలుకు ముఖ్య ప్రసంగీకుడుగా హెర్మెసు అని పేర్లు పెట్టారు. ఆ పట్టణం బయట ఉన్న జ్యూస్ గుడి పూజారి ప్రజలతో కలిసి ఎద్దులను, పూలదండలను పట్టణ ద్వారం దగ్గరకు తీసుకువచ్చి వారికి బలి అర్పించాలని అనుకున్నారు.

అయితే అపొస్తలులైన బర్నబా పౌలు ఈ సంగతి విని, తమ వస్త్రాలను చింపుకొని ఆ జనసమూహంలోనికి చొరబడి, బిగ్గరగా ఇలా అన్నారు: “స్నేహితులారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుష్యులమే. మీరు ఇలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించిన సజీవుడైన దేవుని వైపు తిరగండని మేము మీకు సువార్తను ప్రకటిస్తున్నాము. గతంలో, ఆయన అన్ని దేశాల ప్రజలను తమ సొంత మార్గాల్లో వెళ్లనిచ్చాడు. అయినా కానీ ఆయన గురించి సాక్ష్యం లేకుండా ఉంచలేదు ఎలాగంటే: ఆయన మీకు ఆకాశం నుండి వర్షాన్ని వాటి రుతువుల్లో పంటలు పండింపచేసి తన దయను చూపించారు; సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహిస్తూ మీ హృదయాలను ఆనందంతో నింపుతున్నారు.” వారు ఈ మాటలు చెప్పినా కానీ తమకు బలి అర్పించాలనుకున్న సమూహాన్ని ఆపడం కష్టమైపోయింది.

అంతియొకయ ఈకొనియ ప్రాంతాల నుండి వచ్చిన కొందరు యూదులు జనసమూహాన్ని తమ పక్షం చేసికొని, పౌలును రాళ్లతో కొట్టించి, అతడు చనిపోయాడనుకొని పట్టణం బయటకు ఈడ్చుకొని పోయారు. కానీ విశ్వాసులు అతని చుట్టూ చేరిన వెంటనే, అతడు లేచి పట్టణంలోనికి తిరిగి వెళ్లాడు. మరుసటిరోజు అతడు బర్నబాతో కలిసి దెర్బేకు వెళ్లాడు.

సిరియాలోని అంతియొకయకు తిరిగి వచ్చుట

వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేశారు. తర్వాత లుస్త్ర, ఈకొనియ అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు. శిష్యుల ఆత్మలను బలపరచి విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారిని ప్రోత్సాహించారు. “మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనేక హింసలు పొందాల్సి ఉంది” అని వారు చెప్పారు. పౌలు బర్నబాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రతి సంఘంలో సంఘ పెద్దలను నియమించి, వారు నమ్మిక ఉంచిన ప్రభువుకు వారిని అప్పగించారు. వారు పిసిదియ ప్రాంతం ద్వారా పంఫులియా ప్రాంతానికి వచ్చి, అక్కడ పెర్గే పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అత్తాలియ సముద్రతీరాన ఉన్న పట్టణానికి వెళ్లారు.

అత్తాలియ పట్టణం నుండి బయలుదేరి ఓడ ఎక్కి తాము ఇంతవరకు పూర్తి చేసిన పనిని దేవుని కృపకు అప్పగించి అంతియొకయ పట్టణానికి తిరిగి వచ్చారు. అక్కడ చేరిన వెంటనే, సంఘమంతటిని సమకూర్చి దేవుడు తమ ద్వారా జరిగించిన కార్యాలను, యూదేతరుల కోసం ఆయన ఏ విధంగా విశ్వాసపు ద్వారాన్ని తెరిచాడో వారికి వివరంగా తెలియజేశారు. ఆ తర్వాత వారు శిష్యులతో కలిసి అక్కడే చాలా కాలం ఉన్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.