Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
2 థెస్సలోనికయులకు 3
ప్రార్థన కోసం మనవి
సహోదరీ సహోదరులారా, మిగిలిన విషయాలు ఏంటంటే, ప్రభువు వాక్యం మీలో వ్యాపించిన ప్రకారమే మరింతగా వేగంగా వ్యాపించి ఘనత పొందేలా మాకోసం ప్రార్థించండి. విశ్వాసం అందరికి లేదు కాబట్టి మూర్ఖులైన దుష్టప్రజల నుండి మేము విడిపించబడునట్లు మీరు ప్రార్థించండి. అయితే ప్రభువు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని బలపరచి దుష్టుని నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తున్నారని, వాటిని చేయడం కొనసాగిస్తారని ప్రభువులో మేము నమ్ముతున్నాము. ప్రభువు మీ హృదయాలను దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన సహనం వైపు నడిపించును గాక.
సోమరులకు హెచ్చరిక
సహోదరీ సహోదరులారా, మీరు మా నుండి పొందిన బోధల ప్రకారం జీవించక, తమ పనులను చూసుకోక సోమరులుగా బ్రతుకుతున్న ప్రతి విశ్వాసికి మీరు దూరంగా ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము. మా మాదిరిని మీరు ఎలా అనుసరించాలో అది మీకు తెలుసు. అంటే మేము మీ మధ్యన ఉన్నప్పుడు వట్టి చేతులతో సోమరులుగా కూర్చోలేదు, మేము ఎవరి దగ్గర ఉచితంగా ఆహారాన్ని తినలేదు. దానికి బదులు, మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి పని చేశాము. అలాంటి సహాయాన్ని పొందే హక్కు లేదని అలా చేయలేదు కాని, మీరు మాలా ప్రవర్తించేలా మీకు ఒక ఆదర్శంగా ఉండాలని మేము అలా చేశాము. మేము మీతో ఉన్నప్పుడు, “పని చేయనివాడు ఆహారం తినడానికి పాత్రుడు కాడు” అనే నియమాన్ని కూడా మీకు ఇచ్చాము.
మీలో కొందరు సోమరులుగా ఏ పని చేసుకోకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నారని మేము విన్నాము. అలాంటివారు స్థిరపడి, వారు తినే ఆహారాన్ని వారే సంపాదించుకోవాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము వారిని హెచ్చరిస్తున్నాము, వేడుకుంటున్నాము. సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు.
ఈ ఉత్తరంలో మేము వ్రాసిన సూచనలను పాటించని వారిని గమనించి వారు సిగ్గుపడేలా మీరు వారితో కలవకండి. అయితే వారిని శత్రువులుగా చూడవద్దు కాని, మీ తోటి విశ్వాసులుగా వారిని హెచ్చరించండి.
ముగింపు వందనాలు
సమాధానానికి కర్తయైన దేవుడు అన్ని సమయాల్లో అన్ని విధాలుగా మీకు సమాధానం కలుగజేయును. ప్రభువు మీ అందరికి తోడై ఉండును గాక!
పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను, నేను వ్రాసిన ఉత్తరాలన్నింటిలో నేను వ్రాశాను అనడానికి ప్రత్యేకమైన గుర్తు ఇదే.
మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ అందరితో ఉండును గాక.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.