Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
2 కొరింథీ పత్రిక 6
దేవుని తోటిపనివారిగా మేము, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాము. అయితే,
“నా అనుకూల సమయంలో నీ మొర ఆలకించాను,
రక్షణ దినాన నేను నీకు సహాయం చేశాను”1
అని ఆయన చెప్తున్నారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని మీకు నేను చెప్తున్నాను.
పౌలు కష్టాలు
మా పరిచర్యకు ఎలాంటి నింద రాకూడదని మేము ఎవరి మార్గానికి ఆటంకాన్ని కలిగించడం లేదు. కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా మెప్పించుకుంటున్నాము: సహనంలో సమస్యల్లో కష్టాల్లో దుఃఖాల్లో; దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కష్టమైన పనిలో నిద్రలేని రాత్రుల్లో ఆకలిలో; పవిత్రతలో జ్ఞానంలో ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో; సత్యంగా మాట్లాడంలో దేవుని శక్తిలో; కుడిచేతిలో ఎడమ చేతిలో నీతి అనే ఆయుధాలను కలిగి; ఘనతలో అవమానంలో నిందల్లో మెప్పుల్లో; యథార్థవంతులం అయినప్పటికి మోసం చేసేవారమనే నింద మామీద వేయబడింది; తెలిసినవారమైనా తెలియనివారిగా ఎంచబడ్డాము; మరణిస్తున్నా జీవిస్తూనే ఉన్నాం; కొట్టబడ్డాం కాని చంపబడలేదు; దుఃఖపడినా ఎల్లప్పుడు సంతోషిస్తూనే ఉన్నాం; మేము పేదలం కాని అనేకమందిని ధనవంతులుగా చేస్తున్నాము; ఏమి లేదు కాని సమస్తాన్ని కలిగి ఉన్నాము.
కొరింథీయులారా, మేము మీతో స్వేచ్ఛగా మాట్లాడాము, మా హృదయాలను మీ ఎదుట విశాలంగా తెరిచాం. మా అభిమానాన్ని మీ నుండి మేము తగ్గించడం లేదు, కానీ మా నుండి మిమ్మల్ని మీరే దూరం ఉంచుతున్నారు. నా బిడ్డలుగా భావించి నేను మీతో మాట్లాడుతున్నాను, మాలా మీరు కూడా మీ హృదయాలను విశాలంగా తెరవండి.
విగ్రహారాధన గురించి హెచ్చరిక
అవిశ్వాసులతో సహవాసం చేయకండి. ఎందుకంటే నీతి అవినీతి ఎలా కలిసి ఉంటాయి? చీకటి వెలుతురు ఎలా కలిసి ఉంటాయి? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఏమిటి? దేవాలయాలకు విగ్రహాలకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి? మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేవుడు ఇలా చెప్పారు:
“నేను వారితో నివసిస్తాను
వారి మధ్య నడుస్తాను,
నేను వారి దేవునిగా ఉంటాను,
వారు నా ప్రజలుగా ఉంటారు.”2
కాబట్టి,
“వారి మధ్య నుండి బయటకు వచ్చి
ప్రత్యేకంగా ఉండండి,
అని ప్రభువు చెప్తున్నాడు.
అపవిత్రమైన దానిని తాకకండి,
అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.3
ఇంకా,
“నేను మీకు తండ్రిగా ఉంటాను,
మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు,
అని సర్వశక్తిగల ప్రభువు చెప్తున్నాడు.”4
Source notes (4)
- Footnote యెషయా 49:8
- Footnote లేవీ 26:12; యిర్మీయా 32:38; యెహె 37:27
- Footnote యెషయా 52:11; యెహె 20:34,41
- Footnote 2 సమూ 7:14; 7:8
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.