Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 దినవృత్తాంతములు 9

షేబ రాణి సొలొమోనును దర్శించుట

షేబ దేశపు రాణి సొలొమోను ఖ్యాతి గురించి విన్నప్పుడు, చిక్కు ప్రశ్నలతో అతన్ని పరీక్షిద్దామని ఆమె యెరూషలేముకు వచ్చింది. ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది. సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చాడు. వివరించలేనంత కష్టమైనది అతనికి ఏది లేదు. షేబ రాణి సొలొమోనుకు ఉన్న జ్ఞానాన్ని, అతడు కట్టించిన రాజభవనాన్ని, అతని భోజనబల్ల మీద ఆహారాన్ని, అతని అధికారుల కూర్చునే విధానాన్ని, ప్రత్యేక వస్త్రాలు ధరించి పరిచారం చేసే దాసులను, తమ ప్రత్యేక వస్త్రాల్లో ఉన్న పాత్ర అందించేవారిని, యెహోవా మందిరం వద్ద అతడు అర్పించే దహనబలులను చూసి ఆమె ఆశ్చర్యపడింది.

ఆమె రాజుతో, “మీరు సాధించిన వాటి గురించి, మీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్నది నిజమే. అయితే నేను వచ్చి కళ్ళారా చూసే వరకు వారి మాటలు నమ్మలేకపోయాను. నిజానికి, మీ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి సగం కూడా నాకు చెప్పలేదు; నేను విన్నదానికంటే మీరు ఎంతో గొప్పగా ఉన్నారు. మీ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో! మీ ముందు నిలబడి మీ జ్ఞానాన్ని వింటున్న మీ అధికారులు ఎంత సంతోషంగా ఉంటారో! మీలో ఆనందిస్తూ, మిమ్మల్ని తన సింహాసనం మీద కూర్చోబెట్టిన మీ దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక! ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి, వారిని శాశ్వతంగా సుస్థిరం చేయాలని ఆయనకున్న కోరికను బట్టి, నీతిన్యాయాల ప్రకారం కార్యాలు చేయడానికి యెహోవా మిమ్మల్ని వారిమీద రాజుగా చేశారు” అని అభినందించింది.

తర్వాత ఆమె రాజుకు 120 తలాంతుల1 బంగారం, చాలా సుగంధద్రవ్యాలు, వెలగల రాళ్లు ఇచ్చింది. షేబ రాణి సొలొమోను రాజుకు ఇచ్చిన సుగంధద్రవ్యాలు వంటివి మరెప్పుడూ రాలేదు.

(హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు నుండి బంగారం తెచ్చారు; వారు చందనం, దూలాలు, వెలగల రాళ్లు కూడా తెచ్చారు. ఆ చందనం వాడి, వాటితో రాజు యెహోవా మందిరానికి, రాజభవనానికి మెట్లను, సంగీతకారులకు సితారలు వీణలు చేయించాడు. అంతకుముందు అలాంటివి యూదా ప్రదేశంలో ఎన్నడూ కనిపించలేదు.)

రాజైన సొలొమోను షేబ రాణి కోరిందంతా, అడిగినదంతా ఇచ్చాడు; ఆమె అతనికి తెచ్చిన వాటికంటే ఎక్కువగా ఆమెకు ఇచ్చాడు. తర్వాత ఆమె తన పరివారంతో తన స్వదేశానికి వెళ్లిపోయింది.

సొలొమోను వైభవము

సొలొమోనుకు సంవత్సరానికి వచ్చే బంగారం బరువు 666 తలాంతులు.2 అది వర్తకులు వ్యాపారులు తెచ్చిన ఆదాయం కాక, అరేబియా రాజులందరూ, దేశ అధికారుల నుండి సొలొమోనుకు బంగారం, వెండి తెచ్చారు.

రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారంతో రెండువందల పెద్ద డాళ్లను చేయించాడు; ప్రతి డాలుకు ఆరువందల షెకెళ్ళ3 బంగారం వినియోగించారు. సాగగొట్టిన బంగారంతో అతడు మూడువందల చిన్న డాళ్లు కూడా చేయించాడు. ప్రతి డాలుకు మూడువందల షెకెళ్ళ4 బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన రాజభవనంలో ఉంచాడు.

తర్వాత రాజు దంతంతో పెద్ద సింహాసనం చేయించి మేలిమి బంగారంతో పొదిగించాడు. సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. దానికి ఒక బంగారు పాదపీఠం కట్టి ఉంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి. ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు. రాజైన సొలొమోను పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి, లెబానోను వనపు రాజభవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండితో ఒక్కటి కూడా చేయలేదు, ఎందుకంటే సొలొమోను కాలంలో వెండికి విలువలేదు. హీరాము5 మనుష్యులతో పాటు రాజు ఓడలు సముద్రంలో తర్షీషు వెళ్లి, మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి.

రాజైన సొలొమోను సంపదలో, జ్ఞానంలో లోకంలోని రాజులందరికంటే గొప్పవాడు. దేవుడు అతనికిచ్చిన జ్ఞానాన్ని వినడానికి భూలోక రాజులందరూ సొలొమోనును చూడాలని కోరారు. ప్రతీ సంవత్సరం అతని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కానుకలుగా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వస్త్రాలు, యుద్ధాయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు తెచ్చేవారు.

గుర్రాల కోసం, రథాల కోసం రాజైన సొలొమోనుకు నాలుగువేల శాలలు ఉన్నాయి. పన్నెండువేలమంది గుర్రపు రౌతులున్నారు. రథాలలో కొన్నిటిని రౌతులలో కొందరిని వాటికోసం కట్టిన పట్టణాల్లో ఉంచాడు. కొన్ని యెరూషలేములో తన దగ్గర ఉంచాడు. యూఫ్రటీసు నది ఒడ్డునుండి ఫిలిష్తీయుల దేశం వరకు, ఈజిప్టు సరిహద్దు వరకు ఉండే రాజులందరిపై అతడు పరిపాలన చేసేవాడు. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా చేశాడు, దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు. సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, ఇతర అన్ని దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు.

సొలొమోను మరణం

సొలొమోను పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, మొదటి నుండి చివరి వరకు నాతాను ప్రవక్త వ్రాసిన గ్రంథంలో, షిలోనీయుడైన అహీయా ప్రవచన గ్రంథంలో, దీర్ఘదర్శియైన ఇద్దో నెబాతు కుమారుడైన యరొబాము గురించి వ్రాసిన గ్రంథంలో వ్రాయబడలేదా? సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలందరి మీదా నలభై సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత సొలొమోను చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని అతని తండ్రి దావీదు పట్టణంలో సమాధి చేశారు, సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు.

Source notes (5)
  1. Footnote అంటే, సుమారు 4.5 టన్నులు
  2. Footnote అంటే, సుమారు 25 టన్నులు
  3. Footnote అంటే, సుమారు 6.9 కి. గ్రా. లు
  4. Footnote అంటే, సుమారు 3.5 కి. గ్రా. లు
  5. Footnote హెబ్రీలో హీరాము మరో రూపం హూరాము

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.