Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
2 దినవృత్తాంతములు 27
యూదా రాజైన యోతాము
యోతాము రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెరూష. ఆమె సాదోకు కుమార్తె. అతడు తన తండ్రి ఉజ్జియా చేసినట్లే యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కానీ అతనిలా యెహోవా మందిరంలోకి ప్రవేశించలేదు. ప్రజలు మాత్రం తమ అవినీతి అక్రమాలను కొనసాగించారు. యోతాము యెహోవా ఆలయానికి పై ద్వారాన్ని తిరిగి కట్టించాడు. ఓఫెలు కొండ దగ్గర గోడను చాలా వరకు కట్టించాడు. అతడు యూదా కొండ ప్రాంతంలో పట్టణాలు అడవుల్లో కోటలు బురుజులు నిర్మించాడు.
యోతాము అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి వారిని జయించాడు. ఆ సంవత్సరం అమ్మోనీయులు అతనికి నూరు తలాంతుల1 వెండి, పదివేల కోరుల2 గోధుమలు, పదివేల కోరుల3 యవలు చెల్లించారు. అమ్మోనీయులు రెండవ మూడవ సంవత్సరాల్లో కూడా అదే మొత్తాన్ని అతనికి తీసుకువచ్చారు.
యోతాము తన దేవుడు యెహోవా దృష్టిలో యధార్థంగా ప్రవర్తించినందుచేత అతడు బలాభివృద్ధి చెందాడు.
యోతాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు అతడు చేసిన యుద్ధాలన్నీ, అతడు చేసిన ఇతర కార్యాలన్ని ఇశ్రాయేలు, యూదారాజు చర్రిత గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. యోతాము చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు. ప్రజలు దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.
Source notes (3)
- Footnote అంటే, సుమారు 3 3/4 టన్నులు
- Footnote అంటే, సుమారు 1,800 టన్నులు
- Footnote అంటే, సుమారు 1,500 టన్నులు
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.