Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
1 రాజులు 6
సొలొమోను మందిరాన్ని నిర్మించుట
ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల1 తర్వాత, సొలొమోను ఇశ్రాయేలును పరిపాలిస్తున్న నాలుగవ సంవత్సరం, జీప్ అనే రెండవ నెలలో, సొలొమోను యెహోవా మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు.
రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరం పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ముప్పై మూరలు.2 మందిరంలో విశాల గది ముందు మంటపం ఉంది, మందిరం యొక్క వెడల్పును బట్టి దాని పొడవు ఇరవై మూరలు, మందిరం ముందుకు పది మూరల వెడల్పు. అతడు మందిర గోడలలో పై భాగంలో ఇరుకైన కిటికీలు చేయించాడు. ఆలయ విశాల గది గర్భాలయం యొక్క గోడల చుట్టూరా ప్రక్క గదులు కట్టించాడు. క్రింది అంతస్తు వెడల్పు అయిదు మూరలు,3 రెండవ అంతస్తు గదుల వెడల్పు ఆరు మూరలు4, మూడవ అంతస్తు గదుల వెడల్పు ఏడు మూరలు.5 గదుల దూలాలు మందిర గోడల్లోకి చొచ్చుకుపోకుండా, మందిర బయటి గోడలకు చిమ్మురాళ్లు పెట్టించాడు.
మందిరం కట్టడానికి ముందుగానే చెక్కిన రాళ్లు వాడారు, అది కడుతున్నప్పుడు సుత్తి, గొడ్డలి, మరి ఏ ఇతర ఇనుప పనిముట్ల శబ్దం వినబడలేదు.
క్రింది అంతస్తు గుమ్మం మందిరానికి దక్షిణ వైపున ఉంది; రెండవ అంతస్తుకు, అక్కడినుండి మూడవ అంతస్తుకు ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. అతడు మందిరం కట్టించి దూలాలు, దేవదారు పలకలతో కప్పు వేయించి పూర్తి చేశాడు. అతడు మందిరం చుట్టూ గదులు కట్టించాడు. వీటి ఎత్తు అయిదు మూరలు, అవి మందిరానికి దేవదారు దూలాలతో జత చేయబడ్డాయి.
యెహోవా వాక్కు సొలొమోనుతో, “నీవు కట్టించే ఈ మందిరం విషయంలో, నీవు నా శాసనాలను అనుసరిస్తూ, నా న్యాయనిర్ణయాలు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికి లోబడితే, నేను నీ తండ్రియైన దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ ద్వారా నెరవేరుస్తాను. ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను, నా ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టను” అని చెప్పారు.
సొలొమోను మందిరం కట్టించడం ముగించాడు. మందిరం లోపలి గోడలను, అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో కట్టించాడు. లోపలి గోడలకు దేవదారు పలకలను, నేలను సరళవృక్షాల పలకలను పరిచారు. అతడు మందిరం వెనుక భాగంలో నేల నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో ఇరవై మూరల ఎత్తు గర్భాలయాన్ని అనగా అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. అతి పరిశుద్ధ స్థలానికి ముందున్న విశాల గది పొడవు నలభై మూరలు. మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుండ్రని పండ్లు, విచ్చుకున్న పువ్వులు చెక్కారు; అంతా దేవదారు కర్ర పనే ఉంది గాని రాయి ఒక్కటి కూడా కనిపించదు.
అతడు మందిరం లోపల యెహోవా నిబంధన మందసం పెట్టడానికి గర్భాలయాన్ని సిద్ధపరిచాడు. గర్భాలయం పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ఇరవై మూరలు. దాని లోపలంతా మేలిమి బంగారంతో పొదిగించాడు, దేవదారు కర్రతో చేసిన బలిపీఠాన్ని కూడా చేయించాడు. సొలొమోను మందిరం లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు, గర్భాలయం ముందు భాగానికి బంగారు గొలుసుల తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు. మందిరం లోపలి భాగం పూర్తిగా బంగారంతో పొదిగించాడు. గర్భాలయానికి సంబంధించిన బలిపీఠాన్ని కూడా బంగారంతో పొదిగించాడు.
గర్భాలయం కోసం అతడు ఒలీవ కర్రతో పది మూరల ఎత్తున్న కెరూబుల6 జతను చేయించాడు, ఒక్కొక్కటి పది మూరల ఎత్తు గలవి. మొదటి కెరూబుకు ఒక్కో రెక్క పొడవు అయిదు మూరలు, ఒక రెక్క కొన నుండి ఇంకొక రెక్క కొన వరకు పది మూరలు. రెండవ కెరూబు పొడవు కూడా పది మూరలు. రెండు కెరూబులు ఒకే కొలతతో ఒకే ఆకారంతో ఉన్నాయి. ఒక్కో కెరూబు ఎత్తు పది మూరలు. అతడు ఆ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. వాటి రెక్కలు పూర్తిగా విప్పుకొని ఉన్నాయి. ఒక కెరూబు రెక్క ఒక గోడను, మరో కెరూబు రెక్క ఇంకొక గోడను తాకుతూ గది మధ్యలో వాటి రెక్కలు ఒకదానికొకటి తాకుతూ ఉన్నాయి. అతడు కెరూబులను బంగారంతో పొదిగించాడు.
గర్భాలయంలో, దాని బయట ఉన్న గదుల గోడల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు. అతడు గర్భాలయం నేల మీద, బయటి గది నేల మీద కూడా బంగారంతో పొదిగించాడు.
గర్భాలయం ప్రవేశ ద్వారానికి అతడు ఒలీవ చెక్కతో చేయించిన తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మి నిలువు కమ్మిల వెడల్పు పరిశుద్ధాలయం వెడల్పులో అయిదవ వంతు ఉన్నాయి. ఒలీవ కర్రతో చేసిన ఆ రెండు తలుపుల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు, ఆ కెరూబుల మీద, చెట్లమీద బంగారంతో పొదిగించాడు. అదే రీతిలో ప్రధాన మందిర ప్రవేశ ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు ఉంది. అంతేకాక అతడు రెండు తలుపులు సరళవృక్షాల కర్రతో చేయించాడు, ఆ రెండిటికి రెండేసి మడత రెక్కలు ఉన్నాయి. అతడు తలుపుల మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, విచ్చుకున్న పువ్వులు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు.
లోపలి ఆవరణాన్ని మూడు వరసల్లో చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.
నాలుగవ సంవత్సరం జీప్ నెలలో యెహోవా ఆలయానికి పునాది వేశారు. పదకొండవ సంవత్సరంలో బూలు అనే ఎనిమిదవ నెలలో మందిరాన్ని, దాని భాగాలన్నిటినీ దాని నమూనా ప్రకారం ముగించారు. దానిని కట్టించడానికి సొలొమోనుకు ఏడు సంవత్సరాలు పట్టింది.
Source notes (6)
- Footnote కొ.ప్రా.ప్ర.లలో నాలుగు వందల నలభై సంవత్సరాలు
- Footnote అంటే, 27 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు, 14 మీటర్ల ఎత్తు
- Footnote అంటే, 2.3, మీటర్లు
- Footnote అంటే, 2.7 మీటర్లు
- Footnote అంటే, 3.2 మీటర్లు
- Footnote కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.