Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
1 యోహాను పత్రిక 3
మనం దేవుని పిల్లలమని పిలువబడునట్లు, తండ్రి ఎంత గొప్ప ప్రేమను మనపై కురిపించాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఈ కారణంగానే లోకానికి మనం తెలియదు. ఎందుకంటే దానికి ఆయన తెలియదు. ప్రియ మిత్రులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమే కాని, ఇక ఏమి కానున్నామో ఇంకా స్పష్టం కాలేదు. క్రీస్తు ప్రత్యక్షమైనపుడు,1 ఆయన యథార్థ రూపాన్ని మనం చూస్తాము కాబట్టి, ఆయన వలె ఉంటామని తెలుసుకుంటాము. ఆయనలో నిరీక్షణ ఉంచు ప్రతివారు, ఆయన పవిత్రుడై ఉన్నట్లే తనను పవిత్రునిగా చేసుకుంటారు.
పాపం చేసే ప్రతివారు ఆజ్ఞను అతిక్రమిస్తారు; ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపాలను తొలగించడానికే క్రీస్తు ప్రత్యక్షమయ్యారని మీకు తెలుసు. ఆయనలో ఎలాంటి పాపం లేదు. ఆయనలో జీవించేవారు ఎవరూ పాపంలో కొనసాగరు. పాపంలో కొనసాగేవారు ఆయనను ఎన్నడూ చూడలేదు తెలుసుకోలేదు.
ప్రియ పిల్లలారా, మీరు ఎవరిచేత మోసపోకండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు, నీతిని జరిగించే ప్రతివారు నీతిమంతులే. సాతాను మొదటి నుండి పాపం చేస్తున్నాడు, కాబట్టి పాపం చేసేవారు సాతాను సంబంధులు, సాతాను కార్యాలను నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు. దేవుని వలన పుట్టిన ప్రతివారిలో ఆయన బీజం నిలిచి ఉంటుంది; కాబట్టి వారు పాపంలో కొనసాగరు. వారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి పాపం చేయలేరు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో సాతాను పిల్లలెవరో మనకు తెలుస్తుంది; నీతిని జరిగించని వారు, తన సహోదరుని, సహోదరిని ప్రేమించనివారు దేవుని పిల్లలు కారు.
ఒకరిపట్ల ఒకరికి ప్రేమ ద్వేషం
మనం మొదటి నుండి వింటున్న సందేశం: మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి కయీను వలె ఉండవద్దు, అతడు దుష్టునికి చెందినవాడై తన సహోదరుని చంపాడు. అతడు తన సహోదరుని ఎందుకు చంపాడు? ఎందుకంటే అతడు చేసిన పనులు చెడ్డవి, అతని సహోదరుని పనులు నీతి గలవి. నా సహోదరి సహోదరులారా,2 ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆశ్చర్యపడకండి. మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తున్నాము, కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమ లేనివారు మరణంలో నిలిచివుంటారు. తన సహోదరిని, సహోదరుని ద్వేషించేవారు నరహంతకులు, ఏ నరహంతకునిలో నిత్యజీవం ఉండదని మీకు తెలుసు.
ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టారు, కాబట్టి దీని వలన ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకుంటున్నాము. మనం కూడా మన సహోదరి సహోదరుల కోసం మన ప్రాణాలను పెట్టాలి. ఈ లోకపు ఆస్తులు కలిగినవారు అవసరంలో ఉన్న తన సహోదరుని సహోదరిని చూసి కూడా వారిపై కనికరం చూపించకపోతే, వారిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ప్రియ పిల్లలారా, మనం కేవలం మాటలతో సంభాషణలతో కాకుండా, చేతలతో సత్యంలో ప్రేమిద్దాము.
దీనిని బట్టి, మనం సత్యానికి సంబంధించినవారమని మనకు తెలుస్తుంది, మన హృదయాలు ఆయన సన్నిధిలో విశ్రాంతిగా ఉంటాయి; మన హృదయం మనపై దోషారోపణ చేస్తే, మన హృదయం కంటే దేవుడు గొప్పవాడని ఆయన సమస్తాన్ని ఎరిగినవాడని మనం తెలుసుకుంటాము. ప్రియ స్నేహితులారా, మన హృదయం మనపై దోషారోపణ చేయకపోతే, దేవుని ముందు ధైర్యంగా ఉంటాము. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనకు సంతోషం కలిగించే పనులు చేస్తే, మనం అడిగిన ప్రతిదాన్ని ఆయన నుండి పొందుకుంటాము. ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. దేవుని ఆజ్ఞలను పాటించేవారు వారు ఆయనలో ఉంటారు, వారిలో ఆయన ఉంటారు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో ఉన్నారని మనకు తెలుస్తుంది.
Source notes (2)
- Footnote లేదా అది తెలియజేయబడినప్పుడు
- Footnote దేవుని కుటుంబానికి చెందిన స్త్రీ పురుషులైన విశ్వాసులకు వర్తిస్తుంది.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.