Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
1 కొరింథీ పత్రిక 9
అపొస్తలునిగా పౌలుకు గల హక్కులు
నేను స్వతంత్రున్ని కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువులో నేను చేసిన పనికి ఫలితం మీరు కారా? ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినా, మీకు మాత్రం తప్పక నేను అపొస్తలుడనే! కాబట్టి ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరు ముద్రగా ఉన్నారు.
నాపై నిందారోపణ చేసేవారికి నేను చెప్పే సమాధానమిదే. తినడానికి త్రాగడానికి మాకు హక్కు లేదా? మిగతా అపొస్తలుల్లా, ప్రభువు యొక్క సహోదరుల్లా, కేఫాలా విశ్వాసురాలైన భార్యను మాతో పాటు తీసుకెళ్లడానికి మాకు హక్కు లేదా? జీవనోపాధి కోసం పని చేయకుండ ఉండడానికి నాకు బర్నబా మాత్రమే హక్కు లేదా?
ఎవరైనా తన సొంత ఖర్చులు పెట్టుకొని సైన్యంలో సేవ చేస్తారా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తిననివారు ఎవరు? మందను పోషిస్తూ వాటి పాలు త్రాగనివారు ఎవరు? ఈ మాటలు కేవలం మానవ అధికారంతో చెప్తున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెప్తున్నది కదా! మోషే ధర్మశాస్త్రంలో, “ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు”1 అని వ్రాయబడి ఉంది. దేవుడు ఎద్దులను గురించి చెప్తున్నారా? ఖచ్చితంగా ఆయన మన కొరకే ఈ మాట చెప్పలేదా? అవును, ఇది ఖచ్చితంగా మన కొరకే వ్రాయబడింది, ఎందుకంటే పొలాన్ని దున్నేవారు, త్రొక్కేవారు పంటలో భాగం పొందాలనే ఆశతో పని చేయాలి. మీ మధ్యలో ఆత్మ సంబంధమైన విత్తనాన్ని మేము నాటితే, మీ నుండి ఈ లోకసంబంధమైన పంటను మేము కోస్తే అది గొప్ప విషయమా? మీ నుండి సహాయం పొందడానికి ఇతరులకు హక్కు ఉంటే, మాకు మరి ఎక్కువ హక్కు ఉండదా?
అయితే, ఈ హక్కును మేము ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఆటంకంగా ఉండకూడదని అన్ని ఇబ్బందులను మేము సహిస్తున్నాము.
దేవాలయంలో పని చేసేవారు దేవాలయం నుండే తమ ఆహారాన్ని పొందుతారని, బలిపీఠం దగ్గర సేవ చేసేవారు బలిపీఠం మీద అర్పించిన వాటిలో పాలిభాగస్థులని మీకు తెలియదా? అలాగే, సువార్తను ప్రకటించేవారు సువార్త వల్లనే తమ జీవనోపాధి పొందుకోవాలని ప్రభువు ఆజ్ఞాపించారు.
కాని, నేనైతే వీటిలో దేన్ని ఉపయోగించుకోలేదు. నా పట్ల మీరు ఇలా చేయాలని ఈ సంగతులు వ్రాయడం లేదు. ఈ నా అతిశయాన్ని ఎవరైనా వట్టిదిగా చేస్తే దానికన్నా నాకు మరణమే మేలు. సువార్త ప్రకటించడం నాకు తప్పనిసరి బాధ్యత కాబట్టి నేను సువార్త ప్రకటిస్తున్నానని గొప్ప చెప్పుకోలేను. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ! నేను ఇష్టపూర్వకంగా ప్రకటిస్తే నాకు బహుమానం దొరుకుతుంది. నాకు నేనుగా కాకపోయినా నామీద నమ్మకంతో నాకు అప్పగించబడిన పనిని మాత్రమే నేను చేస్తున్నాను. అప్పుడు నా బహుమానం ఏంటి? సువార్తను ప్రకటించేవానిగా నాకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానము.
పౌలు తన స్వేచ్ఛను ఉపయోగించుకొనుట
నేను స్వతంత్రునిగా ఎవరికీ చెందినవాడిగా ఉన్నప్పటికీ, సాధ్యమైనంత వరకు ఎక్కువమందిని దేవుని కోసం సంపాదించడానికి నన్ను నేను అందరికి దాసునిగా చేసుకున్నాను. యూదులను సంపాదించడానికి యూదునిలా ధర్మశాస్త్రానికి లోబడిన వారిని సంపాదించడానికి నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాన్ని కాకపోయినా ధర్మశాస్త్రానికి లోబడిన వానిలా అయ్యాను. ధర్మశాస్త్రం లేనివారిని సంపాదించడానికి నేను ధర్మశాస్త్రం లేనివారిలో ఒక్కడిని అయ్యాను. దేవుని ధర్మశాస్త్రం నుండి విడుదల పొందకపోయినా నేను క్రీస్తు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాను. బలహీనులను సంపాదించడానికి బలహీనులకు బలహీనుడనయ్యాను. అన్ని విధాలుగా కొందరినైనా రక్షించాలని అందరికి అన్ని విధాలుగా ఉన్నాను. సువార్త వల్ల కలిగే ఆశీర్వాదాలలో నేను భాగస్థునిగా ఉండాలని నేను సువార్త కోసమే వీటన్నిటిని చేశాను.
స్వీయ క్రమశిక్షణ యొక్క అవసరత
పరుగు పందెంలో పాల్గొనే వారందరు పరుగెడతారు కాని, ఒక్కరే బహుమానం పొందుకుంటారని మీకు తెలియదా? అలాగే మీరు బహుమానాన్ని పొందాలని పరుగెత్తండి. ఆటలలో పాల్గొనే ప్రతివారు కఠినమైన శిక్షణ తీసుకుంటారు. వారు నిత్యం ఉండని కిరీటాన్ని పొందడానికి అంత కష్టపడతారు, కానీ మనమైతే నిత్యం నిలిచే కిరీటం పొందడం కోసం కష్టపడతాం. కాబట్టి, గమ్యంలేని వానిలా నేను పరుగెత్తడం లేదు; గాలిని కొట్టువానిలా నేను పోరాడడంలేదు. అయితే, ఇతరులకు సువార్త ప్రకటించిన తర్వాత బహుమానం పొందే అర్హత నేను కోల్పోకుండా ఉండడానికి నా శరీరాన్ని నలగ్గొట్టి, దాన్ని లోబరచుకొంటున్నాను.
Source notes (1)
- Footnote ద్వితీ 25:4
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.