Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 కొరింథీ పత్రిక 7

దాంపత్య జీవితం గురించి

మీరు వ్రాసిన విషయాల గురించి: “స్త్రీతో లైంగిక సంబంధం లేకపోవడం పురుషునికి మంచిది.” అయితే లైంగిక దుర్నీతి జరుగుతుంది కాబట్టి ప్రతి పురుషుడు తన సొంత భార్యతోనే, ప్రతి స్త్రీ తన సొంత భర్తతోనే లైంగిక సంబంధం కలిగి ఉండాలి. భర్త తన భార్య పట్ల వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి, అదే విధంగా భార్య తన భర్తకు వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి. భార్య శరీరం మీద ఆమె భర్తకే గాని ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద భార్యకే గాని అతనికి అధికారం లేదు. మీరు ఇద్దరు వ్యక్తిగతంగా కొంత సమయం ప్రార్థనలో గడపడానికి పరస్పర అంగీకారంతోనే తప్ప ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండకండి. మీ మనస్సును మీరు అదుపు చేసుకోలేనప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండ మీరు తిరిగి కలుసుకోండి. ఇది ఒక సలహా మాత్రమే ఆజ్ఞ కాదు. మీరందరు నాలా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ, మీలో ప్రతి ఒక్కరికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చారు; ఒకరికి ఒక వరం, ఇంకొకరికి ఇంకొక వరాన్ని ఇచ్చారు.

ఇప్పుడు నేను పెళ్ళికానివారితో, విధవరాండ్రతో చెప్పేది ఏంటంటే: నాలా వారు కూడ పెళ్ళి చేసుకోకుండా ఉండడం మంచిది. అయితే వారు తమను తాము అదుపు చేసుకోలేకపోతే పెళ్ళి చేసుకోవాలి. కామంతో రగిలిపోవడం కంటే పెళ్ళి చేసుకోవడం మేలు.

పెళ్ళి అయినవారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించేది ఏంటంటే: భార్య భర్తనుండి వేరుగా ఉండకూడదు. అయితే ఆమె అలా వేరైతే, ఆమె పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవాలి లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.

మిగిలిన వారితో ప్రభువు కాదు నేను చెప్పేది ఏంటంటే: ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి, ఆమె అతనితో కలిసి కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. ఏ స్త్రీకైనా అవిశ్వాసియైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయడానికి అతడు ఇష్టపడితే, ఆమె అతన్ని విడిచిపెట్టకూడదు. అవిశ్వాసియైన భర్త, భార్య ద్వారా పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్త ద్వారా పవిత్రపరచబడుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు, ఇప్పుడైతే వాళ్ళు పవిత్రులు.

అయితే అవిశ్వాసి విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు. అలాంటి సందర్భాలలో ఉన్న విశ్వాసులైన సహోదరుడు లేదా సహోదరి వివాహానికి కట్టుబడి ఉండనవసరం లేదు; సమాధానం కలిగి జీవించడానికి దేవుడు మనల్ని పిలిచారు. ఓ భార్యా, నీ భర్తను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు? ఓ భర్తా, నీ భార్యను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు?

స్థితిలో మార్పు గురించి

ప్రభువు ప్రతిఒక్కరికి ఏ స్థితి నియమించారో, దేవుడు అందరిని ఏ స్థితిలో పిలిచారో ఆ స్థితిలోనే విశ్వాసిగా జీవించాలి. ఇదే నియమాన్ని అన్ని సంఘాలకు నియమిస్తున్నాను. అప్పటికే సున్నతి పొందినవాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పోగొట్టుకోకూడదు. సున్నతి పొందనివాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పొందకూడదు. సున్నతి పొందడంలో గాని పొందకపోవడంలో ఏమి లేదు. దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం. ప్రతి ఒక్కరూ దేవుడు ఏ స్థితిలో తమను పిలిచారో ఆ స్థితిలోనే ఉండాలి.

పిలిచినప్పుడు నీవు దాసునిగా ఉన్నావా? దాని గురించి బాధపడవద్దు; నీవు స్వాతంత్ర్యం పొందుకోగలిగితే స్వాతంత్ర్యం పొందుకో. ప్రభువులో విశ్వాసం ఉంచడానికి పిలువబడిన దాసులు, ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవారు; అదే విధంగా, స్వతంత్రునిగా ఉండి పిలువబడిన వారు క్రీస్తుకు దాసులు. మీరు వెలపెట్టి కొనబడ్డారు కాబట్టి మనుష్యులకు దాసులుగా ఉండకండి. సహోదరీ సహోదరులారా, ప్రతి ఒక్కరిని దేవుడు ఏ స్థితిలో ఉండగా పిలిచారో ఆ స్థితిలోనే వారు దేవునితో నిలిచి ఉండాలి.

పెళ్ళికానివారు, విధవరాండ్ర గురించి

కన్యల గురించి ప్రభువు నుండి నాకు ఆజ్ఞ లేదు గాని, ప్రభువు కృప చేత నమ్మకమైన వానిగా నేను ఒక ఆలోచన చెప్తున్నాను. ఇప్పటి క్లిష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్ధితిలోనే ఉండడం మంచిదని నేను భావిస్తున్నాను. మీరు ఒక స్త్రీకి ప్రమాణం చేశారా? దాని నుండి విడుదల కోరవద్దు. మీరు అలాంటి ప్రమాణం నుండి విడుదల పొందారా? భార్య కోసం వెదకవద్దు. అయితే, మీరు పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు; కన్య పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు. అయితే పెళ్ళి చేసుకున్న వారికి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, అవి మీకు కలుగకూడదని నేను కోరుతున్నాను.

సహోదరీ సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, సమయం తక్కువగా ఉన్నది. కాబట్టి ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్లు జీవించండి. దుఃఖించే వారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడనట్టు, ఏదైనా కొన్నవారు అది తమది కాదన్నట్టు ఉండాలి. ఈ లోక విషయాలతో వ్యవహరించేవారు వాటితో సంబంధం లేనివారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం ఉన్న ప్రస్తుత రూపం గతించిపోతుంది.

మీరు చింతలేనివారై ఉండాలని నేను కోరుకొంటున్నాను. పెళ్ళికానివారు ప్రభువును ఎలా సంతోషపెట్టగలమా అని ప్రభువు విషయాల గురించి చింతిస్తారు. అయితే పెండ్లియైన వారు భార్యను ఎలా సంతోషపెట్టగలనా అని ఈ లోక విషయాల గురించి చింతిస్తున్నారు. పెళ్ళైన వారికి పెళ్ళికాని వారికి మధ్య భేదం ఉంది; పెళ్ళికాని స్త్రీ లేదా కన్య తాను శరీరంలో, ఆత్మలో పవిత్రంగా ఉండాలని ప్రభువు కార్యాలను గురించి ఆలోచిస్తుంది. కాని పెళ్ళైన స్త్రీ తన భర్తను ఎలా సంతోషపెట్టగలనా అనే ఈ లోక విషయాల గురించి ఆలోచిస్తుంది. ఇది మీ మంచి కోసమే తప్ప మిమ్మల్ని ఆటంకపరచాలని కాదు. అయితే మీరు ఇతర విషయాల మీద ధ్యాస పెట్టకుండా ప్రభువు పైనే దృష్టి నిలిపి సరియైన మార్గంలో జీవించమని చెప్తున్నాను.

ఎవరైనా తనకు నిశ్చయమైన కన్య పట్ల గౌరవంగా నడుచుకోవడం లేదని బాధపడితే, ఒకవేళ ఆమె వయస్సు పెరిగిపోవడం వలన పెళ్ళి చేయాలని భావిస్తే, అతడు తాను కోరుకున్నట్లే చేయాలి. అతడు పాపం చేయడం లేదు. వారు పెళ్ళి చేసుకోవాలి. అయితే ఎవడైనా కన్యను పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకొని, దానికి తగిన మనోబలం కలిగి ఉండి తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడైతే అతడు చేసేది కూడా మంచిదే. కాబట్టి ఒకడు కన్యను పెళ్ళి చేసుకున్నా మంచిదే, చేసుకోకపోతే ఇంకా మంచిది.

భార్య తన భర్త బ్రతికి ఉన్నంత వరకు అతనికి కట్టుబడి ఉండాలి. భర్త చనిపోతే ఆమె తనకిష్టమైన వాన్ని పెళ్ళి చేసుకోవడానికి స్వతంత్రురాలే కాని, అతడు దేవునికి చెందినవాడై ఉండాలి. అయితే, ఆమె ఉన్న రీతిగానే ఉంటే, అది ఆమెకు సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. నేనయితే దేవుని ఆత్మను కలిగి ఉన్నాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.