Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
1 దినవృత్తాంతములు 20
రబ్బాను పట్టుకొనుట
వసంతకాలంలో, రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, యోవాబు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అతడు అమ్మోనీయుల దేశాన్ని నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. అయితే దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. యోవాబు రబ్బాపై దాడి చేసి దానిని నాశనం చేశాడు. దావీదు వారి రాజు తలమీద నుండి కిరీటాన్ని తీసుకున్నాడు, అది ఒక తలాంతు1 బరువు కలిగి ఉండి, ప్రశస్తమైన రాళ్లతో పొదిగించబడి ఉంది. దాన్ని దావీదు తలమీద పెట్టుకున్నాడు. అతడు ఆ పట్టణం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము తీసుకెళ్లాడు. అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత దావీదు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.
ఫిలిష్తీయులతో యుద్ధము
కొంతకాలం తర్వాత, గెజెరు దగ్గర ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై, రెఫాయీయుల వారసుడైన సిప్పయి అనే వాన్ని చంపగా ఫిలిష్తీయులు లొంగిపోయారు.
ఫిలిష్తీయులతో జరిగిన మరో యుద్ధంలో యాయీరు కుమారుడు ఎల్హానాను, గిత్తీయుడైన గొల్యాతు సోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటె నేతపనివాని అడ్డకర్రంత పెద్దది.
గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు. అతడు ఇశ్రాయేలీయులను దూషించినప్పుడు, దావీదు సోదరుడు, షిమ్యా కుమారుడైన యోనాతాను అతన్ని చంపాడు.
వీరు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.
Source notes (1)
- Footnote అంటే, సుమారు 34 కి. గ్రా. లు
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.