ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
జెకర్యా 12
యెరూషలేము విడుదల, విజయం
ఇది దేవోక్తి. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలాన్ని విశాలంగా చేసి, భూమికి పునాది వేసి, మనిషిలో జీవాత్మను పుట్టించినవాడు యెహోవా. ఆయన చెబుతున్నది ఏమిటంటే “నేను యెరూషలేమును చుట్టూ ఉన్న సమస్త ప్రజలందరికీ మత్తు కలిగించే పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమును, యూదా దేశాన్ని కూడా ముట్టడిస్తారు.
భూమిపై ఉన్న ఇతర జాతులన్నీ యెరూషలేముకు విరోధంగా సమకూడతాయి. ఆ రోజుల్లో నేను యెరూషలేమును సమస్త జాతులకు బరువైన రాయిగా చేస్తాను, దాన్ని తొలగించాలని చూసేవాళ్ళంతా గాయాలపాలు అవుతారు.” ఇదే యెహోవా వాక్కు. “ఆ దినాన నేను గుర్రాలన్నిటికీ బెదురు, గుర్రపు రౌతులకు వెర్రి పుట్టిస్తాను. యూదావారి విషయం శ్రద్ధ చూపించి, ఇతర ప్రజల గుర్రాలన్నిటికీ గుడ్డితనం కలిగిస్తాను.”
అప్పుడు యెరూషలేములోని అధికారులు, నివాసులు “దేవుడైన యెహోవాను నమ్ముకోవడం వల్ల ఆయన మాకు తోడుగా ఉన్నాడు” అని తమ మనస్సుల్లో చెప్పుకుంటారు. ఆ దినాన నేను యూదా అధికారులను కట్టెల కింద మంటగా చేస్తాను, పనల కింద కాగడాగా చేస్తాను, వారు నాలుగు దిక్కుల్లో ఉన్న ప్రజలందరినీ దహించివేస్తారు. యెరూషలేము నివాసులు తమ స్వస్థలంలో స్థిరంగా నివసిస్తారు.
మొదటగా యెహోవా యూదావారి నివాసాలను రక్షిస్తాడు. దావీదు వంశంవారు, యెరూషలేము ప్రజలు తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారిని చిన్నచూపు చూడకుండా ఉండేలా ఆయన ఇలా చేస్తాడు. ఆ కాలంలో యెహోవా యెరూషలేము నివాసులను కాపాడతాడు. వారిలో బలహీనులు దావీదువంటి వారిలాగా, దావీదు వంశీయులు దేవుని వంటివారుగా, ప్రజల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగా ఉంటారు. ఆ కాలంలో యెరూషలేము మీదికి దండెత్తే ఇతర దేశాల ప్రజలందరినీ నాశనం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను.
అభిషిక్తుని విషయంలో యూదులు పశ్చాత్తాపం, విలాపం
అప్పుడు దావీదు వంశీయుల మీదా యెరూషలేములో నివసించే ప్రజల మీదా కరుణ కలిగించే ఆత్మ కోసం విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరిస్తాను. తాము పొడిచిన నన్ను వారు కళ్లారా చూస్తారు. ఒకడు తన ఏకైక కుమారుడు మరణిస్తే దుఃఖించినట్టు, తన జ్యేష్ఠపుత్రుడు మరణిస్తే ఒకడు విలపించినట్టు అతని విషయమై దుఃఖిస్తూ ప్రలాపిస్తారు.
మెగిద్దో మైదానంలో హదదిమ్మోను దగ్గర జరిగిన విలాపం వలె ఆ రోజున యెరూషలేములో మహా విలాపం జరుగుతుంది. దేశ ప్రజలంతా ఏ వంశానికి ఆ వంశంగా విలపిస్తారు. దావీదు వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. నాతాను వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. లేవి వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా, షిమీ వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. మిగిలిన అన్ని వంశాలవారు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.