ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
తీతు పత్రిక 3
యోగ్యమైన కాపరి పరిచర్య
పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి. వారు ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి జీవించాలి. ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.
అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.
ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు తమ ఎదుట ఉంచబడిన మంచి పనులు శ్రద్ధగా చేయడంలో మనసు లగ్నం చేయమని నీవు ఈ సంగతులను గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.
అంతేగానీ, అర్థం పర్ధంలేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు. మీలో విభేదాలు కలిగించే వారిని ఒకటి రెండుసార్లు హెచ్చరించిన తరువాత వారితో తెగతెంపులు చేసుకో. నీకు తెలుసు, అలాటివాడు దారి తప్పిపోయి పాపం చేసి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు.
నేను నికొపొలిలో చలికాలం గడపాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను అర్తెమానుగాని, తుకికునుగాని నీ దగ్గరకి పంపినప్పుడు నువ్వు నికొపొలికి రావడానికి ప్రయత్నం చెయ్యి. న్యాయవాది జేనానూ అపొల్లోనూ త్వరగా పంపించు. వారికేమీ తక్కువ కాకుండా చూడు.
మన వారు నిష్ఫలులు కాకుండా, ముఖ్య అవసరాలను సమకూర్చుకోగలిగేలా మంచి పనులు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. నాతో ఉన్నవారంతా నీకు అభివందనాలు చెబుతున్నారు. విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించేవారికి మా అభివందనాలు చెప్పు.
కృప మీ అందరికీ తోడై ఉండుగాక.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.