ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ప్రకటన గ్రంథము 15
ఏడు పాత్రలు పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు
పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. అదేమిటంటే ఏడుగురు దేవదూతలు తమ చేతుల్లో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి చివరివి. వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది.
తరువాత నేను ఒక గాజు సముద్రం లాంటిది చూశాను. దానితో అగ్ని కలసి ఉంది. క్రూర మృగాన్నీ, దాని విగ్రహాన్నీ, దాని పేరునూ సూచించే సంఖ్యనూ జయించిన వారు ఆ గాజు సముద్రం దగ్గర నిలబడి ఉండడం నేను చూశాను. వారి చేతుల్లో దేవుడు ఇచ్చిన తీగ వాయిద్యాలు ఉన్నాయి.
వారు దేవుని సేవకుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ,
“ప్రభువైన దేవా, సర్వపరిపాలకా, నీవి గొప్పకార్యాలు, అద్భుతాలు.
సార్వభౌమా, నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి.
ప్రభూ, నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి, నీకు భయపడనివారెవరు? నీ నామాన్ని కీర్తించనిదెవరు?
నీ న్యాయక్రియలు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు.”
ఆ తరువాత నేను చూస్తున్నప్పుడు పరలోకంలో సాక్షపు గుడారం ఉన్న అతి పరిశుద్ధ స్థలం తెరుచుకుంది. అప్పుడు ఏడు తెగుళ్ళు చేతిలో పట్టుకుని ఏడుగురు దూతలు ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చారు. వారంతా పవిత్రమైన, ప్రకాశవంతమైన బట్టలు వేసుకుని ఉన్నారు. రొమ్ముకు బంగారు వల్లెవాటు కట్టుకుని ఉన్నారు.
అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకడు ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాడు. ఆ పాత్రల్లో నిత్యం జీవించే దేవుని ఆగ్రహం నిండి ఉంది. దేవుని యశస్సు నుండీ, బలం నుండీ లేచిన పొగతో అతి పరిశుద్ధ స్థలం నిండిపోయింది. కాబట్టి ఆ ఏడుగురు దూతలకిచ్చిన కీడులన్నీ జరిగే వరకూ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.