Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

కీర్తన 89

ఎజ్రా వంశం వాడైన ఏతాను దైవ ధ్యానం.

యెహోవా కృపాకార్యాలను నేను కలకాలం గానం చేస్తాను. రాబోయే తరాలకు నీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తాను.

నేను అంటున్నాను, నిబంధన విశ్వసనీయత శాశ్వతంగా స్థాపించావు. నీ సత్యం పరలోకంలో శాశ్వతంగా స్థిరపరచావు.

నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను.

శాశ్వతంగా ఉండేలా నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను. సెలా.

యెహోవా, ఆకాశాలు నీ అద్భుతాలను ప్రస్తుతిస్తాయి, పవిత్రుల సమావేశంలో నీ విశ్వసనీయతకు స్తుతులు కలుగుతున్నాయి.

ఆకాశాల్లో యెహోవాకు సాటి ఎవడు? దైవపుత్రుల్లో యెహోవాలాంటి వాడెవడు?

పవిత్రుల సభలో ఆయన గౌరవనీయుడైన దేవుడు. తన చుట్టూ ఉన్న వారందరిలో ఆయన సంభ్రమాశ్చర్యాలుగొలిపే వాడు.

యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీలాంటి బలిష్టుడెవడు? నీ విశ్వాస్యత నిన్ను ఆవరించి ఉంది.

ఉప్పొంగే సముద్రాన్ని నువ్వు అదుపులో ఉంచుతావు, అలలు ఉవ్వెత్తుగా లేస్తే నువ్వు వాటిని అణచివేస్తావు.

చచ్చిన దానితో సమానంగా నువ్వు రాహాబును1 నలిపేశావు. నీ బాహుబలంతో నీ శత్రువులను చెదరగొట్టి వేశావు.

ఆకాశాలు నీవే, భూమి కూడా నీదే. లోకాన్నీ దానిలో ఉన్నదంతా నువ్వే చేశావు.

ఉత్తర దక్షిణ దిక్కులను నువ్వే సృష్టించావు. తాబోరు హెర్మోనులు నీ నామాన్నిబట్టి ఆనందిస్తున్నాయి.

నీకు బలిష్టమైన హస్తం ఉంది. నీ హస్తం దృఢమైనది. నీ కుడిచెయ్యి ఘనమైనది.

నీతిన్యాయాలు నీ సింహాసనానికి ఆధారాలు. కృప, నమ్మకత్వం నీకు ముందుగా నడుస్తాయి.

నిన్ను ఆరాధించే వాళ్ళు ధన్యులు! యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు.

నీ నామాన్ని బట్టి వాళ్ళు రోజంతా ఆనందిస్తారు, నీ నీతిలో వాళ్ళు నిన్ను పొగడుతారు.

వాళ్ళ వైభవోపేతమైన బలం నువ్వే. నీ దయవల్ల మాకు విజయం కలిగింది.

మా డాలు యెహోవాది. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధుడు.

ఒకప్పుడు నువ్వు దర్శనంలో నీ భక్తులతో మాట్లాడావు. నువ్విలా అన్నావు, నేను ఒక శూరుడికి కిరీటం పెట్టాను. ప్రజల్లోనుంచి ఎన్నుకుని అతణ్ణి హెచ్చించాను.

నా సేవకుడైన దావీదును నేను ఎన్నుకున్నాను. నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.

నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది.

ఏ శత్రువూ అతన్ని మోసగించలేడు, దుర్మార్గులు ఎవరూ అతన్ని అణచలేరు.

అతని శత్రువులను అతని ఎదుటే పడగొడతాను. అతన్ని ద్వేషించే వాళ్ళను నేను చంపేస్తాను.

నా సత్యం, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. నా నామాన్నిబట్టి అతనికి విజయం వస్తుంది.

సముద్రం మీద అతని చేతినీ నదుల మీద అతని కుడిచేతినీ నేను ఉంచుతాను.

నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు.

నేను అతన్ని నా పెద్దకొడుకుగా చేసుకుంటాను, భూరాజులందరికంటే ఉన్నత స్థితి ఇస్తాను.

నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది.

అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఆకాశమున్నంత వరకూ అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను.

అతని సంతానం నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే, నా ఆజ్ఞలను అనుసరించకపోతే,

వాళ్ళు నా నియమాలను ఉల్లంఘించి నా న్యాయవిధులను పాటించకపోతే,

నేను వారి తిరుగుబాటుకు బెత్తంతో, వారి దోషానికి దెబ్బలతో శిక్షిస్తాను.

అయితే నా కృపను అతని నుంచి తీసివేయను. నామాట తప్పను.

నా ఒడంబడిక నేను రద్దు చేయను. నా పెదాల మీది మాట మార్చను.

అతని సంతానం శాశ్వతంగా ఉంటుంది అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా ఎదుట ఉంటుంది

చంద్రుడున్నంత కాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది.

నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను దావీదుతో నేను అబద్ధమాడను. సెలా.

అయితే నువ్వు మమ్మల్ని నిరాకరించి వదిలేశావు, నీ అభిషిక్తుని మీద నువ్వు కోపంతో ఉన్నావు.

నీ సేవకుని ఒడంబడిక విడిచిపెట్టేశావు. అతని కిరీటాన్ని నేల మీద పడేసి అపవిత్రపరచావు.

అతని గోడలన్నీ నువ్వు పగలగొట్టావు. అతని కోటలను పాడు చేశావు.

దారిన పోయేవాళ్ళంతా అతన్ని దోచుకున్నారు. తన పొరుగువాళ్లకు అతడు నిందకు ఆస్పదమయ్యాడు.

అతని విరోధుల కుడిచేతిని నువ్వు హెచ్చించావు. అతని శత్రువులందరికీ నువ్వు ఆనందం కలిగించావు.

అతని కత్తిమొన తొలగించావు యుద్దంలో అతన్ని నిలవకుండా చేశావు.

అతని వైభవానికి చరమగీతం పాడావు. అతని సింహాసనాన్ని నేలమట్టం చేశావు.

అతని యువప్రాయాన్ని కుదించావు. సిగ్గుతో అతన్ని కప్పావు. సెలా.

యెహోవా, ఎంతకాలం? నువ్వు శాశ్వతంగా దాక్కుంటావా? ఎంతకాలం నీ కోపం మంటలాగా మండుతూ ఉంటుంది?

నా ఆయుష్షు ఎంత స్వల్పమో తలచుకో. పనికిరాని దేనికోసం నువ్వు మనుషులందరినీ సృష్టించావు?

చావకుండా బతికేవాడెవడు? లేక మృత్యులోకంనుంచి తన జీవాన్ని తప్పించుకోగల వాడెవడు? సెలా.

ప్రభూ, నీ విశ్వసనీయతతో నువ్వు దావీదుతో ప్రమాణం చేసి మొదట చూపిన నీ కృపా కార్యాలు ఏవి?

ప్రభూ, నీ సేవకులకు వచ్చిన నిందను బలమైన రాజ్యాలన్నిటి నుంచి వచ్చిన అవమానాన్ని నా గుండెలో నేనెలా భరిస్తున్నానో తలచుకో.

యెహోవా, నీ శత్రువులు నిందలు మోపుతున్నారు, నీ అభిషిక్తుని అడుగులపై వాళ్ళు నిందలు మోపుతున్నారు.

యెహోవాకు శాశ్వతంగా స్తుతి కలుగు గాక. ఆమేన్‌, ఆమేన్‌.

Source notes (1)
  1. Footnote రాహాబును రాక్షసి

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.