Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

కీర్తన 74

ఆసాపు కీర్తన

దేవా, నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు విడిచిపెట్టావు? నువ్వు మేపే గొర్రెల మీద ఎందుకు కోపగించుకుంటున్నావు?

నీ వారసత్వంగా కొనుక్కున్న గోత్రాన్ని, నువ్వు అనాది కాలంలో విమోచించిన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో. నీ నివాసమైన ఈ సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకో.

నీ పరిశుద్ధ స్థలాన్ని శత్రువులు ఎలా పూర్తిగా పాడు చేశారో వచ్చి ఆ శిథిలాలను చూడు.

నీ ప్రత్యక్ష గుడారంలో నీ శత్రువులు గర్జిస్తున్నారు. వారి విజయధ్వజాలను ఎత్తి నిలబెట్టారు.

దట్టమైన గుబురు చెట్ల మీద గొడ్డళ్ళు ఎత్తినట్టు అది కనిపిస్తున్నది.

వారు గొడ్డళ్ళు, సుత్తెలు తీసుకుని దాని నగిషీ చెక్కడాలను పూర్తిగా విరగగొట్టారు.

నీ పరిశుద్ధ స్థలానికి మంట పెట్టారు. నీ నివాసమైన మందిరాన్ని నేలమట్టం చేసి అపవిత్రపరిచారు.

వాటినన్నిటినీ పూర్తిగా ధ్వంసం చేద్దాం అనుకుంటూ వారు దేశంలోని నీ సమావేశ మందిరాలన్నిటినీ కాల్చివేశారు.

దేవుని నుండి మరి ఏ సూచకక్రియలూ మాకు కనబడటం లేదు. ఇంకా ప్రవక్త కూడా ఎవరూ లేరు. ఇలా ఎంతకాలం జరుగుతుందో ఎవరికీ తెలియదు.

దేవా, శత్రువులు ఎంతకాలం నిన్ను నిందిస్తారు? శత్రువులు నీ నామాన్ని ఎల్లకాలం దూషిస్తారా?

నీ హస్తాన్ని, నీ కుడి చేతిని ఎందుకు ముడుచుకుని ఉన్నావు? నీ వస్త్రంలో నుండి దాన్ని తీసి వారిని నాశనం చెయ్యి.

పురాతన కాలం నుండీ దేవుడు నా రాజుగా ఈ భూమిపై రక్షణ కలిగిస్తూ ఉన్నాడు.

నీ బలంతో సముద్రాన్ని పాయలుగా చేశావు. నీటిలోని బ్రహ్మాండమైన సముద్ర వికృత జీవుల తలలు చితకగొట్టావు.

సముద్ర రాక్షసి తలలను నువ్వు ముక్కలు చేశావు. అరణ్యాల్లో నివసించే వారికి దాన్ని ఆహారంగా ఇచ్చావు.

నీటి ఊటలను, ప్రవాహాలను పుట్టించావు. నిత్యం పారే నదులను ఎండిపోజేశావు.

పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నువ్వే వాటి స్థానాల్లో ఉంచావు.

భూమికి సరిహద్దులు నియమించింది నువ్వే. వేసవికాలం, చలికాలం నువ్వే కలిగించావు.

యెహోవా, శత్రువులు నీపైనా బుద్ధిహీనులు నీ నామంపైనా చేసిన దూషణలు నీ మనసుకు తెచ్చుకో.

నీ పావురం ప్రాణాన్ని క్రూర మృగానికి అప్పగింపకు. బాధలు పొందే నీ ప్రజలను ఎన్నడూ మరువకు.

నీ నిబంధన జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే లోకంలో ఉన్న చీకటి స్థలాలన్నీ బలాత్కారంతో నిండిపోయాయి.

పీడితుణ్ణి అవమానంతో మరలనియ్యకు. బాధలు పొందినవారు, దరిద్రులు నీ నామాన్ని స్తుతిస్తారు గాక.

దేవా, లేచి నీ ఘనతను కాపాడుకో. బుద్ధిహీనులు రోజంతా నిన్ను దూషిస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకో.

నీ శత్రువుల స్వరాన్ని, నిన్ను ఎడతెగక ఎదిరించేవారి గర్జింపులను మరచిపోవద్దు.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.