ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కీర్తన 59
ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు పంపిన మనుషులు ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం).
నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు.
పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు.
నా ప్రాణం తీయడానికి వారు కాపుకాశారు. యెహోవా, నేను దోషం చేసినందుకో, పాపం చేసినందుకో కాదు.
నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదికి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు. లేచి నాకు సహాయం చెయ్యి.
సేనల ప్రభువైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, అన్యజాతులను శిక్షించడానికి మేలుకో. ఆ దుర్మార్గుల్లో ఎవరినీ కనికరించవద్దు.
సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
మన మాటలు ఎవరు వింటారులే అనుకుని వారు తమ నోటితో మాటలు వెళ్లగక్కుతారు. వారి పెదాల్లో కత్తులున్నాయి.
అయితే యెహోవా, నువ్వు వాళ్ళను చూసి నవ్వుతావు. అన్యజాతులను నువ్వు ఎగతాళి చేస్తావు.
దేవా, నా బలమా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నా ఎత్తయిన బురుజు నువ్వే.
నా దేవుడు తన నిబంధన నమ్మకత్వంలో నన్ను కలుసుకుంటాడు. నా శత్రువులకు జరిగిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు.
వారిని చంపొద్దు. ఎందుకంటే నా ప్రజలు దాన్ని మరచిపోతారేమో. మా ధ్వజం లాంటి నువ్వు నీ బలంతో వారిని చెల్లాచెదరు చేసి అణగ గొట్టు.
వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి.
వారు ఇకపై కనబడకుండా పోయేలా కోపంతో వారిని నిర్మూలించు. దేవుడు యాకోబు1 సంతానాన్ని ఏలుతున్నాడని భూదిగంతాల వరకూ మనుషులు తెలుసుకునేలా చెయ్యి.
సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
తిండికోసం అటూ ఇటూ తిరుగుతారు. ఇంకా తృప్తి కలగకపోతే రాత్రి అంతా కనిపెడతారు.
నీవు నాకు ఎత్తయిన బురుజుగా ఉన్నావు. ఆపద రోజున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలాన్ని గూర్చి నేను కీర్తిస్తాను. ఉదయాన నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను.
దేవుడు నాకు ఎత్తయిన కోటగా, నిబంధనా దేవుడుగా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తిస్తాను.
Source notes (1)
- Footnote యాకోబు ఇశ్రాయేలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.