Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

కీర్తన 44

ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల దైవ ధ్యానం.

దేవా, మా పూర్వీకుల రోజుల్లో, మా పితరుల కాలంలో నువ్వు చేసిన పనులన్నిటిని గూర్చి మా పితరులు మాకు చెప్పారు. మేము మా చెవులారా విన్నాం.

నువ్వు నీ చేత్తో వివిధ జాతులను తోసివేశావు. మా ప్రజలను అక్కడ నాటావు. ప్రజలను బాధపెట్టావు. కానీ దేశంలో మా ప్రజలను విస్తరింపజేశావు.

వాళ్ళు తమ చేతనున్న కత్తితో అక్కడి భూమిని తమ కోసం స్వాధీనం చేసుకోలేదు. వారి భుజబలం వారిని రక్షించలేదు. కానీ నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి వాళ్ళకి విజయం సాధించిపెట్టాయి. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నావు.

దేవా, నువ్వే నాకు రాజువి. యాకోబుకు విజయం కలగాలని ఆజ్ఞాపించు.

నీ ద్వారా మేము మా శత్రువులను అణచి వేస్తాం. నీ నామాన్ని బట్టి మేము మాపై లేచే వాళ్ళను తొక్కి వేస్తాం.

నేను నా విల్లుపై భరోసా ఉంచను. నా కత్తి నన్ను రక్షించలేదు.

మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడింది నువ్వే. మమ్మల్ని ద్వేషించే వాళ్ళను సిగ్గుపరిచిందీ నువ్వే.

మా దేవునిలోనే మేము రోజంతా గర్విస్తున్నాం. నీ నామానికి శాశ్వతంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. సెలా.

అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని తోసివేశావు. మా పైకి అవమానం పంపించావు. మా సైన్యాలతో కలసి నువ్వు బయలుదేరడం లేదు.

శత్రువుల ఎదుట నిలబడలేక వెనక్కి తిరిగేలా చేస్తున్నావు. మమ్మల్ని ద్వేషించేవాళ్ళు తమ కోసం మమ్మల్ని దోచుకుంటున్నారు.

వాళ్ళ కోసం ఆహారంగా తయారైన గొర్రెల్లాగా మమ్మల్ని చేశావు. అనేక దేశాల్లోకి మమ్మల్ని చెదరగొట్టావు.

అతి తక్కువ వెలకు మమ్మల్ని అమ్మివేశావు. అలా చేయడం మూలంగా నీ సంపద ఏమీ అధికం కాలేదు.

మా పొరుగు వాళ్ళ దృష్టిలో మమ్మల్ని నిందకూ ఎగతాళికీ పరిహాసానికీ కారణంగా చేశావు.

మా చుట్టూ ఉన్న దేశాల్లో మమ్మల్ని ఒక అవమానంగా, ప్రజలు తల ఊపి హేళన చేయడానికి కారణంగా చేశావు.

పరిహాసం, అవమానం చేసే వాళ్ళ కారణంగా, పగ తీర్చుకునే శత్రువు కారణంగా

ఆ అవమానమే రోజంతా నా ఎదుట ఉంది. నా ముఖంలో కనిపించే అవమానం నన్ను నిలువెల్లా కప్పివేస్తున్నది.

ఇదంతా మాకు జరిగినా మేము మాత్రం నిన్ను మర్చిపోలేదు. నీ నిబంధనను అతిక్రమించలేదు.

మా హృదయం నిన్ను విడిచి వెనక్కి మళ్ళలేదు. మా అడుగులు నీ మార్గాన్ని విడువలేదు.

కానీ నువ్వు నక్కలు తిరిగే చోట మమ్మల్ని తీవ్రంగా విరగ్గొట్టావు. చావునీడ కింద మమ్మల్ని కప్పి ఉంచావు.

ఒకవేళ మేము మా దేవుడి నామాన్ని మర్చిపోయి అన్య దేవతల వైపు మా చెయ్యి చాపితే

హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఇది తెలుసుకోకుండా ఉంటాడా?

కచ్చితంగా మేము నీ కోసం రోజంతా వధకు గురౌతున్నాం. వధించడం కోసం ప్రత్యేకించిన గొర్రెల్లాగా ఉన్నాము.

ప్రభూ, నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? నిద్ర మేలుకో, మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టకు.

నీ ముఖాన్ని మాకెందుకు చాటు చేసుకుంటున్నావు? మా వేదననూ మాకు కలిగే హింసనూ మర్చిపోయావెందుకు?

మా ప్రాణం నేల వరకూ కుంగి పోయింది. మా శరీరం నేలకు కరచుకుని ఉంది.

మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.