ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కీర్తన 141
దావీదు కీర్తన
యెహోవా, నేను నీ కోసం ఆక్రోశిస్తున్నాను. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను ఆదుకో. నేను మొరపెడుతున్నాను, నేను చెప్పేది ఆలకించు.
నా ప్రార్థన నీకు ధూపం లాగా నేను చేతులెత్తడం సాయంకాల నైవేద్యం లాగా ఉండు గాక.
యెహోవా, నా నోటికి కాపలా ఉంచు. నా పెదాలు అనే ద్వారాన్ని కాపు కాయి.
నా మనసును దుష్టత్వం వైపు తిరగనియ్యకు. పాపులతో చేరి దుష్ట కార్యకలాపాల్లో పాలు పొందనీయకు. వాళ్ళు తినే రుచి గల పదార్థాలు నేను తినకుందును గాక.
నీతిమంతులు నన్ను కొడితే అది నాకు దయ చూపినట్టే. వాళ్ళు నన్ను మందలిస్తే అది నా తలకి నూనె రాసినట్టే. అలాంటి దాన్ని నేను అంగీకరిస్తాను. నా ప్రార్థనలు మాత్రం దుర్మార్గుల క్రియలకు వ్యతిరేకంగా ఉంటాయి.
దుర్మార్గుల నాయకులను కొండల అంచుల నుండి పడదోస్తారు. అప్పుడు ప్రజలు నా ఇంపైన మాటలు వినేందుకు వస్తారు.
వారు అంటారు, ఒకడు భూమిని దున్ని చదును చేసినట్టు మా ఎముకలు పాతాళ ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
యెహోవా, నా ప్రభూ, నా కళ్ళు నీవైపే చూస్తున్నాయి. నిన్నే శరణు వేడుకొంటున్నాను. నా ప్రాణానికి భద్రత కలిగించు.
నా కోసం వాళ్ళు పన్నిన వలలో పడకుండా నన్ను తప్పించు. దుష్టులు పెట్టిన బోనుల నుండి నన్ను కాపాడు.
నేను తప్పించుకుపోతూ ఉన్నప్పుడు దుష్టులు తాము పన్నిన వలల్లో తామే చిక్కుకుంటారు గాక.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.