ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
సామెత 2
జ్ఞానం వల్ల ప్రతిఫలం
కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది.
జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు, తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు, పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు, యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.
యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి.
యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన రక్షణ కలుగజేస్తాడు.
న్యాయ ప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు.
అప్పుడు నీతి, న్యాయం, యథార్థత అనే మంచి మార్గాలు నువ్వు తెలుసుకుంటావు.
జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది.
తెలివితేటలు నిన్ను కాపాడతాయి. వివేకం నీకు కాపలా కాస్తుంది.
అది దుష్టులు నడిచే మార్గాల నుండి, మూర్ఖపు మాటలు మాట్లాడే వారి బారి నుండి నిన్ను కాపాడుతుంది.
దుష్టులు చీకటి మార్గాల్లో నడవడం కోసం యథార్థమైన మార్గాలను విడిచిపెడతారు.
కీడు చేసేవాళ్ళు తమ పనుల వల్ల సంతోషిస్తారు. తీవ్రమైన మూర్ఖత్వంతో ప్రవర్తించే వాళ్ళను చూసి ఆనందిస్తారు.
తమ దుష్ట మార్గాలగుండా పయనిస్తారు. వాళ్ళు కపటంతో ఉంటారు.
వ్యభిచారి వలలో పడకుండా, తియ్యగా మాట్లాడి మోసపుచ్చే వేశ్య బారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.
అలాంటి స్త్రీ తన యవ్వనకాలంలో తన భర్తను విడిచిపెట్టి తన దేవుని నిబంధన పెడచెవిన పెడుతుంది.
ఆ స్త్రీ ఇల్లు మరణానికి నడిపిస్తుంది. ఆ స్త్రీ నడిచే మార్గం శవాల దగ్గరికి చేరుతుంది.
ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరిగిరారు. వాళ్ళు జీవమార్గం చేరుకోలేరు.
నేను చెప్పే మాటలు విని ఆ విధంగా నడుచుకుంటే నువ్వు యథార్థవంతులు నడిచే మార్గంలో నడుచుకుంటావు. నీతిమంతుల ప్రవర్తన అనుసరిస్తావు.
నిజాయితీపరులు దేశంలో కాపురం ఉంటారు. సత్యవర్తనులు దేశంలో స్థిరంగా ఉంటారు.
చెడ్డ పనులు చేసేవారు నిర్మూలం అవుతారు. నమ్మకద్రోహులు దేశంలో లేకుండా పోతారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.