Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

ఫిలిప్పీ పత్రిక 1

విశ్వాసికి జీవం క్రీస్తే

ఫిలిప్పీ పట్టణంలో క్రీస్తు యేసుకు చెందిన పరిశుద్ధులందరికీ సంఘ నాయకులకూ పరిచారకులకూ క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి రాస్తున్న సంగతులు. మన తండ్రి దేవుని నుండీ ప్రభువైన యేసు క్రీస్తు నుండీ మీకు కృపా, శాంతీ కలుగు గాక.

నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను. మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే. సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు. మీలో ఈ మంచి పని మొదలు పెట్టినవాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం.

మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను ఖైదులో ఉన్నప్పుడూ, నేను సువార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు. క్రీస్తు యేసు ప్రేమ లోతుల్లో నుంచి, మీ కోసం నేనెంత తపిస్తున్నానో దేవుడే నాకు సాక్షి.

హింసలపై విజయం సాధించిన ఆనందం

మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన అంతేకాక దేవునికి మహిమ, స్తుతి కలిగేలా, మీరు యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలాలతో నిండి ఉండాలి.

సోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా వ్యాపించడానికే అని మీరు తెలుసుకోవాలని ఇప్పుడు కోరుతున్నాను. ఎలాగంటే, నా సంకెళ్ళు క్రీస్తు కోసమే కలిగాయని రాజ భవనం కావలి వారికీ తక్కిన వారందరికీ తెలిసిపోయింది. అంతేకాక, ప్రభువులోని సోదరుల్లో ఎక్కువమంది నా బంధకాలను బట్టి స్థిర విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్కు ప్రకటించడానికి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.

కొంతమంది అసూయతో కలహబుద్ధితో, మరి కొంతమంది మంచి ఉద్దేశంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. ప్రేమతో క్రీస్తును ప్రకటించేవారికి నేను సువార్త పక్షాన వాదించడానికి నియామకం పొందానని తెలుసు. అయితే మిగతా వారు బంధకాల్లో ఉన్న నాకు మరింత బాధ కలిగించాలని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. అయితేనేం? కపటంతో గానీ సత్యంతో గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. అందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా ఆనందిస్తాను.

మీ ప్రార్థనల వలన, యేసు క్రీస్తు ఆత్మసాయం వలన, నా విడుదల కోసం ఇదంతా జరుగుతూ ఉందని నాకు తెలుసు. నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కానని నాకు నిబ్బరమైన ఆశాభావం ఉంది. అయితే, ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా నా జీవితం వలన గానీ, చావు వలన గానీ క్రీస్తును నా శరీరంతో ఘనపరుస్తాను అనే ధైర్యం ఉంది.

నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే. అయినా శరీరంలో నేనింకా బతుకుతూ నా ప్రయాసకు ఫలితం ఉంటే, అప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయాను. నేను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం. అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం. తద్వారా, నేను మీ దగ్గరికి తిరిగి రావడంవల్ల క్రీస్తు యేసులో నన్ను బట్టి మీరు గర్వ పడతారు. మీరు విశ్వాసంలో అభివృద్ధి, ఆనందం పొందడానికి నేను జీవిస్తూ మీ అందరితో ఉంటానని నాకు గట్టి నమ్మకం ఉంది.

నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినా, రాకపోయినా, అందరూ కలిసికట్టుగా సువార్త విశ్వాసం పక్షంగా పోరాడుతూ, ఏక భావంతో నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినేలా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి.

మిమ్మల్ని ఎదిరించే వారికి ఏ విషయంలోనూ భయపడవద్దు. మీ ధైర్యం వారికి నాశనం, మీకు రక్షణ కలుగుతాయని తెలిపే సూచన. ఇది దేవుని వలన కలిగే విడుదల. గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి వింటున్నారు. మీరు కూడా అదే పోరాటంలో ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు కేవలం క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం కూడా కలిగించాడు.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.