Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

లూకా 3

బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య

మత్తయి 3:1-12; మార్కు 1:1-8; యోహా 1:6-8; 15-36

సీజరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు గవర్నర్. హేరోదు గలిలయకు చతుర్థాధికారి. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ, త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు. లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి. అన్న, కయప ముఖ్య యాజకులు. అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు. యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది,

“అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి.

ఆయన బాటలు తిన్నగా చేయండి.

ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి.

వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి.

ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.”

అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో, “సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొమ్మని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను. ఇప్పటికే చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు” అని చెప్పాడు.

అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు. పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు.

“మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు.

క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అయి ఉంటాడని అని అందరూ లోలోపల అనుకుంటున్నారు. వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు. తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.”

అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు. అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతని సోదరుని భార్య హేరోదియ విషయం యోహాను అతన్ని మందలించాడు. హేరోదు అంతవరకూ తాను చేసిన చెడ్డ పనులు చాలవన్నట్టు యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు.

యేసు బాప్తిసం

మత్తయి 3:13-17; మార్కు 1:9-11

ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది. పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”

యేసు తల్లి మరియ వంశ వృక్షం

యేసు తన పని మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు సుమారు ముప్ఫై సంవత్సరాలు. ఆయన యోసేపు కొడుకు (అని ప్రజలు ఎంచారు). యోసేపు హేలీ కొడుకు.

హేలీ మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు. లేవి మెల్కీ కొడుకు.

మెల్కీ యన్న కొడుకు. యన్న యోసేపు కొడుకు. యోసేపు మత్తతీయ కొడుకు. మత్తతీయ ఆమోసు కొడుకు. ఆమోసు నాహోము కొడుకు. నాహోము ఎస్లి కొడుకు. ఎస్లి నగ్గయి కొడుకు.

నగ్గయి మయతు కొడుకు. మయతు మత్తతీయ కొడుకు. మత్తతీయ సిమియ కొడుకు. సిమియ యోశేఖు కొడుకు. యోశేఖు యోదా కొడుకు.

యోదా యోహన్న కొడుకు. యోహన్న రేసా కొడుకు. రేసా జెరుబ్బాబెలు కొడుకు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కొడుకు. షయల్తీయేలు నేరి కొడుకు.

నేరి మెల్కీ కొడుకు. మెల్కీ అద్ది కొడుకు. అద్ది కోసాము కొడుకు. కోసాము ఎల్మదాము కొడుకు. ఎల్మదాము ఏరు కొడుకు.

ఏరు యెహోషువ కొడుకు. యెహోషువ ఎలీయెజెరు కొడుకు. ఎలీయెజెరు యోరీము కొడుకు. యోరీము మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు.

లేవి షిమ్యోను కొడుకు. షిమ్యోను యూదా కొడుకు. యూదా యోసేపు కొడుకు. యోసేపు యోనాము కొడుకు. యోనాము ఎల్యాకీము కొడుకు.

ఎల్యాకీము మెలెయా కొడుకు. మెలెయా మెన్నా కొడుకు. మెన్నా మత్తతా కొడుకు. మత్తతా నాతాను కొడుకు. నాతాను దావీదు కొడుకు.

దావీదు యెష్షయి కొడుకు. యెష్షయి ఓబేదు కొడుకు. ఓబేదు బోయజు కొడుకు. బోయజు శల్మాను కొడుకు. శల్మాను నయస్సోను కొడుకు.

నయస్సోను అమ్మీనాదాబు కొడుకు. అమ్మీనాదాబు అద్మిను కొడుకు. అద్మిను అర్నీ కొడుకు. అర్నీ ఎస్రోము కొడుకు, ఎస్రోము పెరెసు కొడుకు. పెరెసు యూదా కొడుకు.

యూదా యాకోబు కొడుకు. యాకోబు ఇస్సాకు కొడుకు. ఇస్సాకు అబ్రాహాము కొడుకు. అబ్రాహాము తెరహు కొడుకు. తెరహు నాహోరు కొడుకు.

నాహోరు సెరూగు కొడుకు. సెరూగు రయూ కొడుకు. రయూ పెలెగు కొడుకు. పెలెగు హెబెరు కొడుకు. హెబెరు షేలహు కొడుకు.

షేలహు కేయినాను కొడుకు. కేయినాను అర్పక్షదు కొడుకు. అర్పక్షదు షేము కొడుకు. షేము నోవహు కొడుకు. నోవహు లెమెకు కొడుకు.

లెమెకు మెతూషెల కొడుకు. మెతూషెల హనోకు కొడుకు. హనోకు యెరెదు కొడుకు. యెరెదు మహలలేలు కొడుకు. మహలలేలు కేయినాను కొడుకు.

కేయినాను ఎనోషు కొడుకు. ఎనోషు షేతు కొడుకు. షేతు ఆదాము కొడుకు. ఆదాము దేవుని కొడుకు.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.