Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

లేవీ 23

యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. మీరు చాటించ వలసిన యెహోవా నియామక కాలాలు ఇవే. ఈ కాలాల్లో మీరు పరిశుద్ధ సమూహాలుగా సమకూడాలి. నా నియామక కాలాలు ఇవి.

విశ్రాంతి దినం

ఆరు రోజులు పనిచెయ్యాలి. వారంలో ఏడవ రోజు విశ్రాంతి దినం. అది పరిశుద్ధ సంఘ దినం. అందులో మీరు ఏ పనీ చేయకూడదు. మీ ఇళ్ళన్నిటిలో అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఇవి యెహోవా నియామక కాలాలు. వాటిని బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంఘ దినాలు ఇవి.

పస్కా పండగ, పొంగని రొట్టెల పండగ

1

మొదటి నెల పద్నాలుగో రోజు సాయంత్రం యెహోవా పస్కా పండగ జరుగుతుంది. ఆ నెల పదిహేనో రోజున యెహోవాకు పొంగని రొట్టెల పండగ జరుగుతుంది. ఏడు రోజుల పాటు మీరు పొంగని వంటకాలే తినాలి. మొదటి రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదు. ఏడు రోజులు మీరు యెహోవాకు హోమ బలి చేయాలి. ఏడవ రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదని వారితో చెప్పు.”

మొదటి పంటలు

యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకు ఇస్తున్న దేశానికి మీరు వచ్చి దాని పంట కోసేటప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గరికి తేవాలి. యెహోవా మిమ్మల్ని అంగీకరించేలా అతడు యెహోవా సన్నిధిలో ఆ పనను కదిలించాలి. విశ్రాంతి రోజుకు మరుసటి రోజున యాజకుడు దాన్ని కదిలించాలి. మీరు ఆ పనను అర్పించే రోజున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పించాలి. దాని నైవేద్యం నూనెతో కలిసిన పది వంతుల గోదుమపిండి రెండు భాగాలు. అది యెహోవాకు పరిమళ హోమం. దాని పానార్పణం ఒక లీటర్ ద్రాక్షారసం. మీరు మీ దేవునికి అర్పణం తెచ్చేదాకా ఆ దినమంతా మీరు రొట్టె, పేలాలు, పచ్చని వెన్నులు, మొదలైనవి ఏమీ తినకూడదు. ఇది మీ తరతరాలకు మీ నివాసాలన్నిటిలో నిత్య శాసనం.

పెంతెకొస్తు పండుగ

మీరు విశ్రాంతి రోజుకు మరునాడు మొదలు, అంటే కదిలించే పనను మీరు తెచ్చిన దినం మొదలు కుని ఏడు వారాలు లెక్కించాలి. లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారాలు ఉండాలి. ఏడవ విశ్రాంతి దినం మరుసటి దినం వరకూ మీరు ఏభై రోజులు లెక్కించి యెహోవాకు కొత్త పండ్లతో నైవేద్యం అర్పించాలి. మీరు మీ ఇళ్ళలో నుండి తూములో రెండేసి పదివంతుల పిండితో చేసిన రెండు రొట్టెలను కదిలించే అర్పణంగా తేవాలి. వాటిని గోదుమపిండితో చేసి పొంగేలా కాల్చాలి. అవి యెహోవాకు ప్రథమఫలాల అర్పణం.

మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లలు ఏడింటిని, ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పించాలి. అవి వారి నైవేద్యాలతోను వారి పానార్పణాలతోను దహనబలిగా యెహోవాకు పరిమళ హోమం అవుతుంది. అప్పుడు మీరు మేకల్లో ఒక పోతును పాపపరిహార బలిగా అర్పించి రెండు ఏడాది వయసున్న గొర్రెపిల్లలను శాంతి బలిగా అర్పించాలి. యాజకుడు ప్రథమఫలాల రొట్టెలతో ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని కదిలించాలి. అవి యెహోవాకు ప్రతిష్ఠించిన భాగాలు. అవి యాజకునివి. ఆ రోజే మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలని చాటించాలి. అ రోజున మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. ఇది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం.

మీరు మీ పంటపొలం కోసేటప్పుడు పొలం అంచుల్లో పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. పేదవారికి, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.”

బూరలూదే పండుగ

యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఏడో నెల మొదటి రోజు మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ కొమ్ము బూరధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలి. ఆ రోజున మీరు జీవనోపాధి కోసం పని చేయడం మాని యెహోవాకు హోమం చేయాలి.”

ప్రాయశ్చిత్తం చేసే రోజు

యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “ఈ ఏడో నెల పదవ రోజు పాపానికి ప్రాయశ్చిత్తం చేసే రోజు. అ రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుని యెహోవాకు హోమం చేయాలి. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు మీ కోసం ప్రాయశ్చిత్తం చేసుకోడానికి అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజున తనను దుఃఖపరుచుకోకుండా ఉండే ప్రతివాణ్ణి తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి. ఆ రోజున ఏ పని అయినా చేసే ప్రతివాణ్ణి తన ప్రజల్లో ఉండకుండాా నాశనం చేస్తాను. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. అది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం. అది మీకు మహా విశ్రాంతి దినం. అ రోజున మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. ఆ నెల తొమ్మిదో రోజు సాయంత్రం మొదలు మరుసటి సాయంత్రం వరకూ మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి.”

పర్ణశాలల పండగ

యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఈ ఏడో నెల పదిహేనో దినం మొదలు ఏడు దినాలు యెహోవాకు పర్ణశాలల పండగ జరపాలి. వాటిలో మొదటి రోజున మీరు పరిశుద్ధసంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. ఏడు రోజులు మీరు యెహోవాకు హోమం చేయాలి. ఎనిమిదో రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడి యెహోవాకు హోమబలి అర్పించాలి. అది మీకు వ్రతదినం. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.

ఇవి యెహోవా నియామక పండగలు. ఆయనకు హోమ బలులు, దహన బలులు, నైవేద్యాలు, పానీయార్పణలు అర్పించడానికి పరిశుద్ధ సంఘ దినాలుగా మీరు చాటించవలసిన రోజులు ఇవే. ఏ అర్పణ రోజున ఆ అర్పణ తేవాలి. యెహోవా నియమించిన విశ్రాంతి దినాలకు, మీరు కానుకలు ఇచ్చే రోజులకు, మీ మొక్కుబడి రోజులకు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణలిచ్చే రోజులకు ఇవి అదనం. అయితే ఏడో నెల పదిహేనో రోజున మీరు పంట సమకూర్చుకునేటప్పుడు ఏడు రోజులు యెహోవాకు ఉత్సవం చెయ్యాలి. మొదటిరోజు, ఎనిమిదవ రోజు విశ్రాంతి దినాలు.

మొదటి రోజున మీరు దబ్బ కాయలు, ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలవల ఒడ్డున ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు తెచ్చి ఏడు రోజులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఉత్సవం చేసుకోవాలి. అలా మీరు ఏటేటా ఏడు రోజులు యెహోవాకు పండగగా ఆచరించాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం. ఏడవ నెలలో దాన్ని ఆచరించాలి. నేను ఐగుప్తులోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారు పర్ణశాలలో నివసించేలా చేసానని మీ ప్రజలకు తెలిసేలా ఏడు రోజులు మీరు పర్ణశాలల్లో నివసించాలి. ఇశ్రాయేలీయుల్లో పుట్టిన వారంతా పర్ణశాలల్లో నివసించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.”

ఈ విధంగా మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలాలను తెలియపరిచాడు.

Source notes (1)
  1. Footnote ఇది మార్చి 16 నుంచి ఏప్రిల్ 17 లోపల వస్తుంది.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.