Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

యోబు 19

యోబు జవాబు

అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు,

మీరు నన్ను ఇలా ఎంతకాలం బాధపెడతారు? ఎంతకాలం మాటలతో నన్ను నలగగొడతారు?

పదిసార్లు మీరు నన్ను నిందించారు. సిగ్గు లేకుండా నన్ను బాధిస్తూ ఉన్నారు.

నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదికే వస్తుంది గదా?

మిమ్మల్ని మీరే గొప్పచేసుకుంటున్నారా? నా మీద నేరం రుజువు చెయ్యాలని చూస్తున్నారా?

అయితే వినండి. దేవుడు నాపట్ల అన్యాయంగా ప్రవర్తించాడు. ఆయన తన వలలో నన్ను చిక్కించుకున్నాడు. ఈ విషయం మీరు తెలుసుకోండి.

నాకు అపకారం జరుగుతున్నదని నేను ఎంతగా మొరపెట్టినా ఎవ్వరూ నా మొర ఆలకించడం లేదు. సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను కానీ నాకు న్యాయం జరగడం లేదు.

ఆయన నా మార్గం చుట్టూ నేను దాట లేని కంచె వేశాడు. నా దారులన్నీ చీకటిమయం చేశాడు.

ఆయన నా గౌరవ మర్యాదలను హీనంగా ఎంచాడు. నా తల మీద నుండి నా కిరీటం తొలగించాడు.

అన్ని వైపుల నుండి ఆయన నన్ను దెబ్బతీశాడు. నేను పతనం అయ్యాను. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా ఆశాభావాన్ని పెళ్లగించాడు.

ఆయన తీవ్రమైన ఆగ్రహం నా మీద రగులుకుంది. నన్ను ఒక శత్రువుగా ఆయన భావించాడు.

ఆయన సేనలు కూడి వచ్చి నా గుడారం చుట్టూ మాటువేశారు. నా చుట్టూ ముట్టడి దిబ్బలు వేశారు.

ఆయన నా బంధువర్గమంతా దూరమయ్యేలా చేశాడు. నా స్నేహితులు పూర్తిగా పరాయివాళ్ళు అయ్యారు.

నా బంధువులు నన్ను పరామర్శించడం లేదు. నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయారు.

నా యింటి దాసదాసీలు నన్ను పరాయివాణ్ణిగా చూస్తారు. నేను వాళ్ళ దృష్టిలో ఒక విదేశీయుడి వలే ఉన్నాను.

నేను నా పనివాణ్ణి పిలిస్తే వాడు పలకడం లేదు. నేను వాణ్ణి ప్రాధేయపడవలసి వచ్చింది.

నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది. నా ఉనికి అంటేనే నా సొంత తోబుట్టువులకు1 ద్వేషం.

చిన్నపిల్లలకు కూడా నేనంటే అసహ్యం. నేను కనబడితే వాళ్ళు నన్ను తిట్టిపోస్తారు.

నా ప్రాణస్నేహితులందరూ నన్ను చూసి ఆసహ్యించుకుంటున్నారు. నేను ఇష్టపడిన వాళ్ళు నాకు శత్రువులయ్యారు.

నా ఎముకలు నా చర్మానికీ, మాంసానికీ అంటుకుపోయాయి. నా దంతాల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది.

నా మీద జాలి పడండి. దేవుని హస్తం నన్ను పూర్తిగా దెబ్బతీసింది. నా స్నేహితులారా నా మీద జాలి చూపండి.

నా శరీర మాంసం పూర్తిగా నాశనం అయ్యింది. ఇది చాలదన్నట్టు దేవుడు నన్ను హింసిస్తున్నట్టు మీరు కూడా నన్నెందుకు వేధిస్తున్నారు?

నా మాటలన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టి ఉంచాలని నేను ఆశిస్తున్నాను.

నా మాటలు నిరంతరం నిలిచి ఉండేలా శిలాక్షరాలై, ఇనుప గంటంతో చెక్కబడి, సీసం కరిగించి పోసి ఉంటే ఎంత బాగుంటుంది!

నా విమోచకుడు శాశ్వతంగా ఉండే వాడనీ, అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడనీ నాకు తెలుసు.

ఈ విధంగా నా చర్మం చీకి చీలికలైపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను.

మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపలి భాగాలు కృశించిపోయాయి.

దీనంతటికీ మూల కారణం నాలోనే ఉన్నదన్న తప్పు భావంతో మీరు నన్ను ఎలా హింసిద్దామా అనుకుంటూ ఉండవచ్చు.

అయితే మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుడు పంపిన ఆగ్రహం అనే ఖడ్గం దోషులను శిక్షిస్తుంది. అప్పుడు దేవుని తీర్పు ఉంటుందని మీరు తెలుసుకుంటారు.

Source notes (1)
  1. Footnote సొంత తోబుట్టువులకు పిల్లలు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.