ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
యోబు 10
నా బ్రతుకు మీద నాకు అసహ్యం కలుగుతుంతోంది. నేను అడ్డూ అదుపూ లేకుండా అంగలారుస్తాను. నా మనసులో ఉన్న బాధ కొద్దీ మాట్లాడతాను.
నేను దేవునితో మాట్లాడతాను. నా మీద నేరం మోపకు. నువ్వు నాతో ఎందుకు వాదం పెట్టుకున్నావో చెప్పమని అడుగుతాను.
నువ్వు ఇలా క్రూరంగా ప్రవర్తించడం నీకు ఇష్టమా? దుర్మార్గుల ఆలోచనలు నెరవేరేలా వాళ్ళపై నీ దయ చూపడం నీకు సంతోషం కలిగిస్తుందా? నీ చేతిపనులను తిరస్కరించడం నీకు సంతోషమా?
మనుషులు చూస్తున్నట్టు నువ్వు కూడా చూస్తున్నావా? నీ ఆలోచనలు మనుషుల ఆలోచనల వంటివా?
నీ జీవితకాలం మనుషుల జీవితకాలం వంటిదా? నీ సంవత్సరాలు మనుషుల ఆయుష్షు వంటివా?
నేను ఎలాంటి నేరం చేయలేదనీ, నీ చేతిలోనుండి నన్ను ఎవ్వరూ విడిపించలేరనీ నీకు తెలుసు.
అయినప్పటికీ నా నేరాలను గూర్చి ఎందుకు విచారణ చేస్తున్నావు? నాలో పాపాలు ఎందుకు వెతుకుతున్నావు?
నీ సొంత చేతులతో నా శరీరంలోని అవయవాలు నిర్మించి నన్ను నిలబెట్టావు. అలాంటిది నువ్వే నన్ను మింగివేస్తున్నావు.
ఒక విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వే నన్ను బంకమట్టితో నిర్మించావు. మళ్ళీ నువ్వే నన్ను మట్టిలో కలిసిపోయేలా చేస్తావా?
ఒకడు పాలు ఒలకబోసినట్టు నువ్వు నన్ను ఒలకబోస్తున్నావు. పాలను పెరుగులా చేసినట్టు నన్ను పేరబెడుతున్నావు.
మాంసం, చర్మాలతో నన్ను కప్పావు. ఎముకలు, నరాలతో నన్ను రూపొందించావు.
నాకు ప్రాణం పోసి నాపై కృప చూపించావు. నీ కాపుదలతో నా ఆత్మను రక్షించావు.
అయినా నేను చేసే దోషాలను గూర్చి నీ హృదయంలో ఆలోచించావు. అలాంటి అభిప్రాయం నీకు ఉన్నదని నాకు తెలుసు.
ఒకవేళ నేనేదైనా పాపం చేస్తే నీకు తెలిసిపోతుంది. నాకు శిక్ష విధించాలని నన్ను గమనిస్తూ ఉంటావు.
నేను గనక పాప క్రియలు జరిగిస్తే అవి నన్నెంతో బాధిస్తాయి. నేను నిర్దోషిని అయినప్పటికీ నా తల ఎత్తుకోలేను. ఎందుకంటే నేను అవమానంతో నిండి పోయి నాకు కలిగిన బాధను తలంచుకుంటూ ఉంటాను.
నా తల పైకెత్తితే సింహం వేటాడినట్టు నన్ను వేటాడతావు. నీ బలప్రభావాలు మళ్లీ నా మీద చూపిస్తావు.
ఎడతెగని నీ కోపం పెరిగిపోతుంది. ఎప్పుడూ సేనల వెనుక సేనలను నా మీదికి దండెత్తేలా చేస్తూ ఉంటావు.
నా తల్లి గర్భం నుండి నన్నెందుకు బయటకు రప్పించావు? పుట్టినప్పుడే ఎవరూ నన్ను చూడకుండా ఉన్నప్పుడే ప్రాణం వదిలితే బాగుండేది.
అప్పుడు నా ఉనికే ఉండేది కాదు. తల్లి గర్భం నుండే నేరుగా సమాధికి తిరిగి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి.
నేను జీవించే రోజులు స్వల్పమే. అక్కడికి వెళ్లక ముందు కొంచెం సేపు నేను ఊరట చెందేలా నా జోలికి రాకుండా నన్ను విడిచిపెట్టు.
నేను తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతున్నాను. ఆ లోకమంతా మరణాంధకారం ఆవరించి ఉంది.
అక్కడ అర్థరాత్రి వలె దట్టమైన కటిక చీకటి. ఎంత మాత్రం క్రమం అనేది లేని ఆ మరణాంధకార దేశంలో వెలుగు అర్థరాత్రివేళ చీకటిలాగా ఉంది.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.