Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

యెషయా 28

ఎఫ్రాయీముకు శ్రమ

ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న పూలమాలకు1 బాధ. వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యానికి బాధ.

అది ద్రాక్షారసం వశంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు నివసించే పచ్చని లోయ తలపై ఉన్న కిరీటం.

వినండి! శక్తిశాలీ, బలశాలీ అయిన ఒకడు ప్రభువుకి ఉన్నాడు. అతడు వడగళ్ళ లాంటి వాడు.

అతడు వినాశనకారి అయిన తుఫాను వంటివాడు. ముంచెత్తే బలమైన జడివాన వంటివాడు. ఆయన తన చేతితో భూమిని కొడతాడు.

ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న కిరీటాన్ని కింద పడేసి కాళ్ళతో తొక్కుతారు.

పచ్చని లోయ తలపై ఉన్న వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యం

కోతకాలం రాకముందే పండిపోయిన మొదటి అంజూరపు పండులా ఉంటుంది.

మొదట దాన్ని చూసినవాడు దాన్ని చేతిలోకి తీసుకున్న వెంటనే నోట్లో వేసుకుని మింగివేస్తాడు.

ఆ రోజున సేనల ప్రభువైన యెహోవా మిగిలి ఉన్న తన ప్రజలకు తానే అందమైన కిరీటంగానూ, అందమైన రాజ మకుటంగానూ ఉంటాడు.

ఆయన న్యాయం చెప్పడానికి న్యాయపీఠం పైన కూర్చున్న వాడికి న్యాయం నేర్పే ఆత్మగానూ, తమ ద్వారాల దగ్గర శత్రువులను తరిమి కొట్టే వాళ్లకి బలంగానూ ఉంటాడు.

అయితే వీళ్ళు కూడా ద్రాక్షారసం తాగి తూలుతారు. మద్యపానం చేసి తడబడతారు.

యాజకుడైనా, ప్రవక్త అయినా మద్యం తాగి తూలుతారు. ద్రాక్షారసం వాళ్ళని వశం చేసుకుంటుంది.

మద్యపానం చేసి తడబడుతూ ఉంటారు. దర్శనం కలిగినప్పుడు తూలుతూ ఉంటారు. తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు తడబడతారు.

వాళ్ళు భోజనం చేసే బల్లలు అన్నీ వాంతితో నిండి ఉన్నాయి. శుభ్రమైన స్థలం అక్కడ కనిపించదు.

వాడు జ్ఞానాన్ని ఎవరికి బోధిస్తాడు? వర్తమానాన్ని ఎవరికి వివరిస్తాడు? పాలు విడిచిన వాళ్ళకా? లేక తల్లి రొమ్ము విడిచిన వాళ్ళకా?

ఎందుకంటే “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రంగా, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెంగా ఉంటుంది.” అని వాళ్ళు అనుకుంటారు.

అప్పుడు ఆయన నిజంగానే వాళ్ళతో వెక్కిరించే పెదాలతో, విదేశీ భాషలో మాట్లాడతాడు.

గతంలో ఆయన వాళ్ళతో “ఇది విశ్రాంతి స్థలం. అలసి పోయిన వాళ్ళని విశ్రాంతి తీసుకోనివ్వండి” అన్నాడు. కానీ వాళ్ళు వినలేదు.

కాబట్టి వాళ్ళు వెళ్ళి వెనక్కి పడి, కుంగిపోయి, వలలో చిక్కుకుని, బందీలు అయ్యేలా యెహోవా మాట వాళ్లకి ఇలా వస్తుంది.

“ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రం,

ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం.”

కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళూ, యెరూషలేములో ఈ ప్రజలను పాలించే వాళ్ళు, యెహోవా మాట వినండి.

మీరు ఇలా అన్నారు “మేం చావుతో నిబంధన చేసుకున్నాం. పాతాళంతో ఒక ఒప్పందానికి వచ్చాం. కాబట్టి కీడు ప్రవాహంలా వచ్చినా అది మమ్మల్ని తాకదు. ఎందుకంటే మేం అబద్ధాన్ని ఆశ్రయించాం. మిథ్య వెనుక దాక్కున్నాం.”

దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు.

“చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి2.

ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు.

నేను న్యాయాన్ని కొలబద్దగానూ, నీతిని ఒడంబంగానూ చేస్తాను. వడగళ్ళు మీ అబద్దాలనే ఆశ్రయాన్ని తుడిచి పెట్టేస్తాయి.

మీరు దాగి ఉన్న చోటును వరద నీళ్ళు ముంచెత్తుతాయి.

చావుతో మీరు చేసుకున్న నిబంధనను రద్దు చేస్తాను. పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం చెల్లదు.

వరద ప్రవాహంలా విపత్తు మీకు పైగా దాటినప్పుడు మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు.

అవి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ముంచెత్తి వేస్తాయి.

ప్రతి ఉదయమూ, ప్రతి పగలూ, ప్రతి రాత్రీ అది వస్తుంది.

ఈ వార్త అర్థం అయినప్పుడు అది మహాభయాన్ని కలిగిస్తుంది.

పడుకుని కాళ్ళు చాపుకోడానికి మంచం పొడవు చాలదు. కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు.

యెహోవా తన పనిని జరిగించడానికి, ఆశ్చర్యకరమైన తన పనిని చేయడానికి, విచిత్రమైన తన పనిని జరిగించడానికి

పెరాజీము పర్వతం పైన లేచినట్టుగా లేస్తాడు. గిబియోను లోయలో ఆయన తనను తాను రెచ్చగొట్టుకున్నట్టుగా లేస్తాడు.

కాబట్టి పరిహాసం చేయకండి. లేకుంటే మీ సంకెళ్ళు మరింతగా బిగుసుకుంటాయి.

సేనల ప్రభువైన యెహోవా నుండి భూమిపైన నాశనం జరుగుతుందనే సమాచారం నేను విన్నాను.

కాబట్టి మనస్సు పెట్టి నేను చెప్పేది వినండి. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి.

రైతు విత్తడానికి ఎప్పుడూ పొలం దున్నుతూనే ఉంటాడా? ఎప్పుడూ పొలంలో మట్టి పెళ్లలను పగలగొడుతూ ఉంటాడా?

అతడు నేలను చదును చేసిన తర్వాత సోపు గింజలు చల్లడా? జీలకర్ర చల్లడా?

గోధుమలు వరుసల్లో, బార్లీ సరైన స్థలంలో వేసి చేను అంచుల్లో మిరప మొక్కలు నాటడా?

అతడి దేవుడే అతడికి ఆ క్రమాన్ని నేర్పించాడు. ఎలా చేయాలో జ్ఞానంతో అతనికి బోధించాడు.

జీలకర్రను యంత్రంలో ఉంచి నూర్చారు. జీలకర్ర పై బండి చక్రాన్ని దొర్లించరు.

కానీ సోపుని చువ్వతో, జీలకర్రను కర్రతో దుళ్ళకొడతారు.

మనుషులు రొట్టెల కోసం గోధుమలను నూర్చి పిండి చేస్తారు. కానీ అదేపనిగా గోధుమలను పిండి చేస్తూనే ఉండరు కదా!

గోధుమలను దుళ్ళగొట్టడానికి గుర్రాలనూ బండి చక్రాలనూ నడిపిస్తారు గానీ దాన్ని పిండి చేయడానికి కాదు కదా!

దీన్ని కూడా మనుషులకు సేనల ప్రభువైన యెహోవా నేర్పిస్తున్నాడు.

ఆయన బోధ అద్భుతంగానూ ఆయన ఆలోచన శ్రేష్టంగానూ ఉంటుంది.”

Source notes (2)
  1. Footnote పూలమాలకు కిరీటం
  2. Footnote కీర్తన 118:22-23, రోమి. 9:33; 10:11, 1పేతురు 2:6

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.