ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ఆది 40
యోసేపు, రాజోద్యోగులు
ఆ తరువాత ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడూ, రొట్టెలు చేసేవాడూ తమ యజమాని పట్ల నేరం చేశారు. తన ఇద్దరు ఉద్యోగస్థులు, అంటే గిన్నె అందించే వాడి మీదా రొట్టెలు చేసే వాడి మీదా ఫరో కోపగించుకున్నాడు. వారిని చెరసాలలో ఉంచడానికి రాజు అంగరక్షకుల అధిపతికి అప్పగించాడు. ఆ చెరసాలలోనే యోసేపును కూడా బంధించారు. ఆ అధిపతి వారందరినీ యోసేపు ఆధీనంలో ఉంచాడు. అతడు వారి బాగోగులు చూసేవాడు.
వారు కొన్నిరోజులు బందీలుగా ఉన్న తరువాత వారిద్దరూ, అంటే ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు ఒకే రాత్రి కలలు కన్నారు. ఒక్కొక్కడు వేరు వేరు భావాలతో కల కన్నారు.
ఉదయాన యోసేపు వారి దగ్గరికి వచ్చి చూసినపుడు వారు విచారంగా ఉన్నారు. అతడు “మీరెందుకు విచారంగా ఉన్నారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు “మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది. వాటి అర్థం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు” అన్నారు. యోసేపు వారితో “అర్థాలు తెలియచేయడం దేవుని అధీనమే గదా! దయచేసి నాకు చెప్పండి” అన్నాడు. అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుతో “నా కలలో ఒక ద్రాక్షతీగ నా ఎదుట ఉంది. ఆ ద్రాక్షతీగకు మూడు కొమ్మలున్నాయి. దానికి మొగ్గలొచ్చి పూలు పూసి గెలలు పండి ద్రాక్షపళ్ళు వచ్చాయి. ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేను ద్రాక్షపళ్ళు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను” అని చెప్పాడు. అప్పుడు యోసేపు “దాని అర్థం ఇదే. ఆ మూడు కొమ్మలు, మూడు రోజులు. ఇంక మూడు రోజుల్లో ఫరో నిన్ను హెచ్చించి, నువ్వు అతనికి గిన్నె అందించే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇప్పిస్తాడు. అయితే నీకంతా సరి అయినప్పుడు నన్ను గుర్తు చేసుకుని నామీద దయ చూపించు. ఫరో దగ్గర నా గురించి మాట్లాడి ఈ చెరసాల నుండి నేను బయటికి వచ్చేలా చూడు. ఎందుకంటే నన్ను హెబ్రీయుల దేశం నుండి దొంగిలించి తీసుకొచ్చారు. ఈ చెరసాలలో నన్ను వేయడానికి ఇక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు” అన్నాడు.
రొట్టెలు చేసే వాడు యోసేపు మంచి అర్థం చెప్పడం చూసి అతనితో “నాకూ ఒక కల వచ్చింది. మూడు రొట్టెల బుట్టలు నా తల మీద ఉన్నాయి. పై బుట్టలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ బుట్టలో నుండి వాటిని తిన్నాయి” అన్నాడు. యోసేపు “దాని అర్థం ఇదే. ఆ మూడు బుట్టలు మూడు రోజులు. ఇంక మూడు రోజుల్లో ఫరో నీ తల తీసి చెట్టుకు వేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తింటాయి” అని జవాబిచ్చాడు. మూడవ రోజు ఫరో పుట్టినరోజు. అతడు తన సేవకులందరికీ విందు చేయించాడు. వారందరిలో గిన్నె అందించేవారి నాయకుడిపైనా రొట్టెలు చేసే వారి నాయకుడిపైనా మిగతా సేవకులందరికంటే ధ్యాస పెట్టాడు. గిన్నె అందించేవారి నాయకుని ఉద్యోగం అతనికి తిరిగి ఇచ్చాడు, కాబట్టి అతడు ఫరో చేతికి మళ్ళీ గిన్నె అందించాడు. యోసేపు చెప్పినట్టుగా రొట్టెలు చేసేవారి నాయకుణ్ణి ఉరి తీయించాడు. అయితే గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు చేస్తానన్న సాయం గురించి పట్టించుకోలేదు. అసలు అతని గురించి మరచిపోయాడు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.