ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ఆది 4
కయీను, హేబెల్
ఆదాము తన భార్య హవ్వను కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చి కయీనుకు జన్మనిచ్చింది. ఆమె “యెహోవా సహాయంతో నేనొక మగ బిడ్డకు జన్మనిచ్చాను” అంది. తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి. కయీను వ్యవసాయం చేసేవాడు.
కొంతకాలం తరువాత కయీను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత యెహోవాకు అర్పణ ఇవ్వడానికి తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు. కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించ లేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు.
యెహోవా కయీనుతో “ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు? నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి” అన్నాడు.
కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు1. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేశాడు. అప్పుడు యెహోవా కయీనుతో “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అన్నాడు. అతడు “నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపలా వాడినా?” అన్నాడు. దేవుడు “నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు 2మొరపెడుతూ ఉంది. ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండాా నువ్వు శాపానికి గురయ్యావు. నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు” అన్నాడు.
కయీను “నా శిక్ష నేను భరించలేనిది. ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ భూమి మీద పలాయనం అవుతూ, దేశదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు” అన్నాడు.
యెహోవా అతనితో “అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను శిక్షించిన దానికి ఏడు రెట్లు అలాటి వాణ్ణి శిక్షిస్తాను” అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు.
కయీను సంతతి
కాబట్టి కయీను యెహోవా సన్నిధిలోనుంచి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పువైపు ఉన్న నోదు ప్రాంతంలో నివాసం ఉన్నాడు. కయీను తన భార్యను కలిసినప్పుడు ఆమె గర్భం ధరించి హనోకుకు జన్మనిచ్చింది. అతడు ఒక ఊరు కట్టించి దానికి తన కొడుకు పేర హనోకు అని పెట్టాడు.
హనోకు ఈరాదుకు తండ్రి. ఈరాదు మహూయాయేలుకు తండ్రి. మహూయాయేలు మతూషాయేలుకు తండ్రి. మతూషాయేలు లెమెకుకు తండ్రి. లెమెకు ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు. వారిలో ఒకామె పేరు ఆదా, రెండవ ఆమె సిల్లా.
ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. అతడు పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుషుడు. అతని తమ్ముడు యూబాలు. ఇతను తీగె వాయుద్యాలు, వేణువు వాయించే వాళ్ళందరికీ మూలపురుషుడు. సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. అతడు రాగి, ఇనప పరికరాలు చేసేవాడు. తూబల్కయీను చెల్లి పేరు నయమా.
లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు. “ఆదా, సిల్లా, నా మాట వినండి.
లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి.
నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను.
కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.
ఏడంతలు ప్రతీకారం కయీను కోసం వస్తే లెమెకు కోసం డెబ్భై ఏడు రెట్లు వస్తుంది.”
షేతు, ఎనోషు
ఆదాము మళ్ళీ తన భార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది. అతనికి షేతు అని పేరు పెట్టి “కయీను చంపిన హేబెలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు” అంది. షేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పటినుండి మనుషులు యెహోవాను 3ఆరాధించడం ఆరంభించారు.
Source notes (3)
- Footnote పొలానికి వెళదాం పద అన్నాడు.
- Footnote ప్రతీకారం కోసం.
- Footnote అక్షరాలా యెహోవా పేరెత్తి పిలవడం మొదలు పెట్టారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.