Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

ఆది 16

హాగరు, ఇష్మాయేలు

అబ్రాముకు భార్య శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక దాసి ఉంది. ఆమె పేరు హాగరు. శారయి అబ్రాముతో “ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో” అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.

అబ్రాము అప్పటికి కనాను దేశంలో పదేళ్ల నుండి నివాసముంటున్నాడు. అబ్రాము భార్య శారయి ఈజిప్టుకు చెందిన తన దాసి హాగరును తన భర్తకు భార్యగా ఉండటానికి ఇచ్చింది. అతడు హాగరుతో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం ధరించింది. తాను గర్భం ధరించానని తెలుసుకున్న హాగరు తన యజమానురాలిని చులకనగా చూడటం ప్రారంభించింది.

అప్పుడు శారయి అబ్రాముతో “నా ఉసురు నీకు తగులుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నేనే నీ చేతుల్లో పెట్టాను. ఆమె గర్భవతి అయింది. అది తెలిసిన దగ్గరనుండీ అది కన్నూమిన్నూ గానక నన్ను చులకనగా చూడటం మొదలు పెట్టింది. నీకూ నాకూ మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు” అంది. అందుకు అబ్రాము “ఇలా చూడు, నీ దాసి నీ చెప్పుచేతల్లోనే ఉంది గదా. ఆమె విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో” అన్నాడు. శారయి తన దాసిని రాచి రంపాన పెట్టింది. దాంతో ఆమె శారయి దగ్గర నుండి పారిపోయింది.

షూరుకు వెళ్ళే దారిలో అడవిలో నీటి ఊట దగ్గర యెహోవా దూత ఆమెను చూశాడు. ఆమెతో “శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వస్తున్నావ్? ఎక్కడికి వెళ్తున్నావ్?” అని అడిగాడు. అందుకామె “నా యజమానురాలైన శారయి దగ్గరనుండి పారిపోతున్నాను” అంది. అప్పుడు యెహోవా దూత “నువ్వు మళ్ళీ నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళు. ఆమెకు పూర్తిగా అణిగి మణిగి ఉండు” అన్నాడు. యెహోవా దూత ఇంకా ఇలా చెప్పాడు. “నీ సంతానానికి తప్పకుండా ఆధిక్యత కలిగిస్తాను. అది లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అయ్యేలా చేస్తాను” అని ఆమెకు చెప్పాడు.

తరువాత యెహోవా దూత “ఇలా చూడు, యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు. నీకు కొడుకు పుడతాడు. అతనికి 1ఇష్మాయేలు అనే పేరు పెడతావు. అతడు అడవి గాడిదలా స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. అందరూ అతనికి విరోధంగా ఉంటారు. అతడు ప్రతి ఒక్కరికీ 2తూర్పు దిక్కున నివసిస్తాడు. అతడు తన సోదరులకు వేరుగా నివసిస్తాడు” అని ఆమెకు చెప్పాడు.

అప్పుడు ఆమె “నన్ను చూసినవాడు నాకు నిజంగా కనిపించాడు కదా!” అంది. అందుకనే తనతో మాట్లాడిన యెహోవాకు “3నన్ను చూస్తున్న దేవుడివి నువ్వే” అనే పేరు పెట్టింది. దీన్ని బట్టి ఆ నీటి ఊటకి “4బెయేర్‌ లహాయి రోయి” అనే పేరు వచ్చింది. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది.

తరువాత హాగరు అబ్రాము కొడుక్కి జన్మనిచ్చింది. హాగరు ద్వారా పుట్టిన తన కుమారుడికి అబ్రాము ఇష్మాయేలు అనే పేరు పెట్టాడు. అబ్రాము కొడుకు ఇష్మాయేలుకు హాగరు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.

Source notes (4)
  1. Footnote అంటే దేవుడు వింటాడు.
  2. Footnote ప్రతి ఒక్కరికీ విరోధంగా అని కూడా అర్థం ఉంది.
  3. Footnote లహాయి రోయి
  4. Footnote నన్ను చూస్తున్న దేవుని బావి

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.