Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

ఎజ్రా 9

ఎజ్రా ప్రార్ధించడం

ఈ విషయాలన్నీ ముగిసిన తరువాత పెద్దలు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు. “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు అందరూ కనానీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, యెబూసీయుల, అమ్మోనీయుల, మోయాబీయుల, ఐగుప్తీయుల, అమోరీయుల జాతి ప్రజల నుండి తమను తాము ప్రత్యేకపరుచుకోకుండా ఆ జాతుల ప్రజలు చేస్తున్న అసహ్యకరమైన చెడ్డ పనులు వారు కూడా చేస్తున్నారు. వారి ఆడపిల్లలను పెళ్లి చేసుకొంటున్నారు, తమ కూతుళ్ళని వారి కొడుకులకు ఇస్తున్నారు. ప్రత్యేక జనంగా ఉండాల్సిన వీరు ఆ జాతుల పవిత్రమైన ప్రజలతో కలిసిపోయారు. పైగా ఈ తప్పులు చేస్తున్న వారిలో మన పెద్దలు, అధికారులు కూడా ప్రముఖంగా ఉన్నారు.”

ఈ సంగతి విని నేను నిర్ఘాంతపోయాను. నా అంగీనీ, దుప్పటినీ చింపుకుని, నా తల వెంట్రుకలు, గడ్డపు వెంట్రుకలు పెరికి వేసుకుని కూర్చుండిపోయాను. గతంలో చెర నుండి తిరిగి వచ్చినవారు జరిగించిన దోషాలు తెలిసిన ఇశ్రాయేలీయులు, దేవుని మాటకు భయపడే ప్రజలు నా దగ్గరికి గుంపులుగా వచ్చారు. నేను అయోమయ స్థితిలో సాయంత్రం బలి అర్పించే సమయం దాకా అలాగే కూర్చుండి పోయాను. సాయంత్రం బలి అర్పించే సమయానికి నేను కృంగిన స్థితి నుంచి తేరుకుని లేచాను. నా దుప్పటి, అంగీ చిరిగిపోయి ఉన్న స్థితిలోనే మోకరించి, నా దేవుడైన యెహోవా వైపు చేతులు పైకెత్తి ఇలా ప్రార్ధించాను, “నా దేవా నా దేవా, నా ముఖం నీ వైపు ఎత్తి చూపలేక సిగ్గుతో కృంగిపోయి ఉన్నాను. మా దోషాలు మా తలల కంటే పైగా పెరిగిపోయాయి, మా నేరాలు ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయాయి.

మా పూర్వీకులతో మొదలు ఇప్పటివరకూ మేమంతా ఘోరమైన అపరాధాలు చేస్తూ వచ్చాం. మేము చేసిన దోషాలను బట్టి ఈ రోజు ఉన్నట్టుగా మేమూ, మా రాజులూ, యాజకులూ అన్యదేశపు రాజుల స్వాధీనంలో, చావుకూ చెరకూ దోపిడీకీ గురై ఉండడం వలన ఎంతో అవమానభారంతో సిగ్గుపడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు మా దేవుడైన యెహోవా మా కళ్ళను వెలిగించి, మా బానిసత్వం నుండి మేము సేదదీరేలా, మాలో కొందరిని జీవించి ఉండేలా చేసి, ఆయన పరిశుద్ధ స్థలం లో మేము స్థిర నివాసం ఏర్పరచుకొనేలా కొంతవరకూ మా విషయంలో దయ చూపించాడు. నిజంగా మేము దాసులమైనప్పటికీ మా దేవుడివైన నువ్వు మమ్మల్ని ఆ దాస్యంలోనే ఉండనియ్యలేదు. పర్షియా దేశపు రాజుల ముందు మా పట్ల దయ చూపించావు. మేము సేదదీరేలా మా దేవుని ఆలయం నిలబెట్టావు. యూదా దేశంలోని యెరూషలేము పట్టణంలో పాడైపోయిన స్థలాలను తిరిగి బాగుచేయడానికి, మాకు ఒక ఆశ్రయం కల్పించడానికి నీ కృప అనుగ్రహించావు. మా దేవా, ఇంత కనికరం పొందిన మేము ఇంకేం చెప్పగలం? నీ దాసులైన ప్రవక్తల ద్వారా నువ్వు మాకిచ్చిన ఆజ్ఞలను అనుసరించలేకపోయాం.

ప్రవక్తలు మాతో చెబుతూనే వచ్చారు-మీరు స్వతంత్రించుకోబోయే దేశం అక్కడి ప్రజల హేయ కృత్యాలతో, మలినకార్యాలతో అపవిత్రం అయిపోయింది. వారు చేసిన అసహ్యమైన పనులు దేశం నాలుగు దిక్కులకు వ్యాపించాయి. అందువల్ల మీరు మీ కూతుళ్ళను వారి కొడుకులకు, వారి కూతుళ్ళను మీ కొడుకులకు ఇచ్చి పుచ్చుకోకండి. వాళ్లకు క్షేమం, సుఖ సౌఖ్యాలు కలగాలని ఎన్నడూ కోరుకోవద్దు. ఇలా చేసినట్టైతే మీరు స్థిరంగా నిలిచి, ఆ దేశ సుఖాలు అనుభవించి, మీ పిల్లలకు శాశ్వతంగా నిలిచి ఉండే వారసత్వం అప్పగిస్తారు.

మా చెడ్డ పనులు, ఘోరమైన అపరాధం కారణంగా ఈ బాధలన్నీ మాపైకి వచ్చాయి. మా దేవుడవైన నువ్వు మా దోషాలకు రావలసిన శిక్షను తగ్గించి మాకు ఈ విధంగా విడుదల కలిగించావు. అయితే మేము నీ ఆజ్ఞలు అతిక్రమించి అసహ్యకరమైన పనులు చేసే ఈ ప్రజలతో సాంగత్యం చేసినప్పుడు, తప్పించుకొనే మార్గం లేని విధంగా మాలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ నాశనం చెయ్యాలన్నంత కోపం నీకు వస్తుంది గదా. యెహోవా, ఇశ్రాయేలు దేవా, నువ్వు నీతిపరుడివి. కాబట్టి ఈనాటి వరకూ మిగిలిన మేము కొద్దిమందిమే. ఇదిగో, మేము నీ సన్నిధిలో అపరాధులం. నీ సన్నిధిలో నిలబడడానికి ఎవ్వరికీ అర్హత లేదు.”

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.