Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

యెహెజ్కేలు 8

దేవాలయంలో విగ్రహారాధన

బబులోను చెరలో ఉన్న కాలంలో, ఆరో సంవత్సరం ఆరో నెల ఐదో రోజున నేను నా ఇంట్లో కూర్చుని ఉన్నాను. యూదా ప్రజల్లో పెద్దలు నా ఎదుట కూర్చుని ఉన్నారు. అప్పుడు ప్రభువైన యెహోవా హస్తం నా పైకి వచ్చింది. నేను చూసినప్పుడు అదిగో చూడండి! నాకు ఒక మానవాకారం కనిపించింది. అది నడుము నుండి కిందకు అగ్నిలాగా ఉంది. నడుము నుండి పైకి తేజస్సుతో ప్రకాశిస్తున్న కంచులా నాకు కనిపించింది.

ఆయన నావైపు చెయ్యి వంటిదాన్ని చాపాడు. నా తలపై జుట్టును ఆయన పట్టుకున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ నన్ను లేపి భూమికీ ఆకాశానికీ మధ్యకు ఎత్తాడు. అప్పుడు నాకు కలిగిన దేవుని దర్శనంలో ఆయన యెరూషలేముకు ఉత్తరాన ఉన్న ఆవరణ ద్వారం దగ్గర తీవ్రమైన రోషాన్ని కలిగించే విగ్రహం ఉన్న చోటికి నన్ను తెచ్చాడు. ఇంతకుముందు నేను మైదానప్రాంతంలో చూసిన ఇశ్రాయేలు దేవుని తేజస్సు అక్కడ నాకు కనిపించింది.

అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, ఉత్తరం వైపుకి శ్రద్ధగా చూడు.” ద్వారానికి ఉత్తరం వైపు దారి బలిపీఠానికి దారి తీస్తుంది. అక్కడే రోషం కలిగించే విగ్రహం ఉంది. నేను ఆ వైపుకి తదేకంగా చూశాను. నాకు ఆ విగ్రహం కనిపించింది. అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, వాళ్ళేం చేస్తున్నారో చూస్తున్నావా? నా సొంత మందిరం నుండి నేను వెళ్ళిపోవడానికి కారణమైన నీచమైన పనులు ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారు! నువ్వు పక్కకి తిరిగి చూస్తే వీటి కంటే అసహ్యమైన పనులు వీరు చేయడం చూస్తావు.”

ఆ తరువాత ఆయన నన్ను ఆవరణ ద్వారం దగ్గర దించాడు. అక్కడ గోడకి ఒక రంధ్రం కనిపించింది. ఆయన నాకిలా చెప్పాడు. “నరపుత్రుడా, ఆ గోడ తవ్వు.” అప్పుడు నేను ఆ గోడ తవ్వాను. తవ్విన చోట ఒక ద్వారం కనిపించింది. ఆయన తిరిగి నాతో “నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నారో చూడు” అన్నాడు.

కాబట్టి నేను లోపలికి వెళ్ళి చూశాను. అక్కడ పాకే ప్రతి జంతువూ, అసహ్యమైన మృగాలూ ఉన్నాయి. ఆ గోడపైన ఇశ్రాయేలు జాతి దేవుళ్ళ విగ్రహాలన్నీ చెక్కి ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు పెద్దలైన డెబ్భై మంది అక్కడ ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కొడుకు యజన్యా ఉన్నాడు. వాళ్ళంతా ఆ బొమ్మలకి ఎదురుగా నిలబడి ఉన్నారు. ప్రతివాడి చేతిలో ధూపం వేసే పాత్ర ఒకటి ఉంది. వాళ్ళంతా ధూపం వేయడం వల్ల అది ఒక మేఘంలా పైకి వెళ్తూ ఉంది. దాని పరిమళం అంతటా నిండి ఉంది.

అప్పుడాయన నాకిలా చెప్పాడు. “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు చీకట్లో ఏం చేస్తున్నారో చూశావా? ప్రతి ఒక్కడూ తన తన రహస్య గదుల్లో తన విగ్రహాలకు ఇలాగే చేస్తున్నాడు. ‘యెహోవా మమ్మల్ని చూడ్డం లేదు. యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడు’ అని చెప్పుకుంటున్నారు.” తరువాత ఆయన “నువ్వు ఈ వైపుకి తిరిగి చూడు. వీటికి మించిన అసహ్యమైన పనులు వీళ్ళు చేయడం చూస్తావు” అన్నాడు.

ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరానికి ఉత్తరం వైపున ఉన్న ద్వారం దగ్గర నన్ను దించాడు. అక్కడ చూడండి! స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవుడి కోసం ఏడుస్తున్నారు. అప్పుడాయన “నరపుత్రుడా, ఇది చూశావా? ఇప్పుడు ఇంతకంటే అసహ్యమైనది చూస్తావు” అని నాకు చెప్పాడు.

ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరం లోపలి ఆవరణలో నన్ను దించాడు. అక్కడ చూస్తే, మందిర ద్వారం దగ్గర మంటపానికీ బలిపీఠానికీ మధ్యలో ఇరవై ఐదు మంది పురుషులు ఉన్నారు. వారు తూర్పు వైపుకి తిరిగి ఉన్నారు. వాళ్ళ వీపులు వెనుక యెహోవా మందిరం వైపుకీ, ముఖాలు తూర్పు వైపుకీ ఉన్నాయి. వాళ్ళు తూర్పున ఉన్న సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు.

అప్పుడాయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నువ్వు ఇదంతా చూస్తున్నావా? యూదా జాతి ప్రజలు ఇక్కడ చేస్తున్న అసహ్యమైన పనులు స్వల్పమైనవా? వాళ్ళు దేశాన్ని బలాత్కారంతో నింపివేశారు. ముక్కులకు తీగలు తగిలించుకుంటూ నా కోపాన్ని మరింత రెచ్చగొడుతున్నారు. కాబట్టి నేను వాళ్ళ మధ్య నా పని జరిగిస్తాను. నా దృష్టిలో వాళ్ళ పట్ల నాకెలాంటి కనికరమూ ఉండదు. నేను వాళ్ళని వదలను. వాళ్ళు నా చెవిలో ఎంత పెద్ద స్వరంతో ఏడ్చినా నేను వినను.”

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.