Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

యెహెజ్కేలు 48

భూ భాగాలు విభజన

గోత్రాల పేర్లు ఇవి. దానీయులకు ఒక భాగం. అది ఉత్తరదిక్కు సరిహద్దు నుండి హమాతుకు వెళ్ళే మార్గం వరకూ హెత్లోనుకు వెళ్ళే సరిహద్దు వరకూ హసరేనాను అనే దమస్కు సరిహద్దు వరకూ హమాతు సరిహద్దు దారిలో తూర్పుగా, పడమరగా వ్యాపించి ఉన్న భూమి. దాను సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగం. ఆషేరీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగం.

నఫ్తాలి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగం. మనష్షేయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగం. ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగం. రూబేనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగం.

యూదావారి సరిహద్దును అనుకుని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్టించే పవిత్రమైన స్థలం ఉంటుంది. దాని వెడల్పు 13 కిలోమీటర్ల 500 మీటర్లు దాని పొడవు తూర్పు నుండి పడమర వరకూ మిగిలిన భాగాల్లాగా ఉంటుంది. పరిశుద్ధ స్థలం దాని మధ్యలో ఉండాలి. యెహోవాకు మీరు ప్రతిష్టించే ఈ ప్రదేశం 13 కిలోమీటర్ల, 500 మీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల, 400 మీటర్ల వెడల్పు ఉండాలి.

ఈ పవిత్రమైన స్థలం యాజకులది. అది ఉత్తరాన 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, పశ్చిమాన 5 కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు, తూర్పున 5 కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు, దక్షిణ దిక్కున 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు ఉండాలి. యెహోవా పరిశుద్ధస్థలం దాని మధ్య ఉంటుంది. ఇది సాదోకు సంతతికి చెంది నాకు ప్రతిష్టితులై నేను వారికి అప్పగించిన దాన్ని కాపాడే యాజకులది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోయినప్పుడు మిగిలిన లేవీయులు వారితో పోయినట్టు వారు నన్ను విడిచిపోలేదు. పవిత్రమైన భూమిలో లేవీయుల సరిహద్దు దగ్గర వారికొక స్థలం ఉంటుంది. దాన్ని అతి పరిశుద్ధంగా ఎంచుతారు.

యాజకుల సరిహద్దును ఆనుకుని లేవీయులకు ఒక స్థలం ఏర్పాటు చేయాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ రెండు స్థలాల మొత్తం పొడవు 13 కిలోమీటర్ల 500 మీటర్లు. వెడల్పు పది కిలో మీటర్ల 800 మీటర్లు ఉంటుంది. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి కాబట్టి దానిలో ఏ కొంచెం భాగమైనా వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమి ప్రథమ ఫలాలను ఇతరులను అనుభవింపనియ్య కూడదు.

13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, రెండు కిలోమీటర్ల 700 మీటర్ల వెడల్పు ఉన్న మిగిలిన స్థలం సమిష్టి భూమిగా ఎంచి, పట్టణంలో నివాసాలకు, మైదానాలకు వాడాలి. దాని మధ్య నగర నిర్మాణం జరుగుతుంది. నగర పరిమాణ వివరాలు, ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, దక్షిణాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, తూర్పున రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, పశ్చిమాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, నగరానికి చేరిన ఖాళీ స్థలం ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు పడమటి వైపు, నాలుగు దిక్కుల్లో సమానంగా 135 మీటర్లు ఉండాలి. పవిత్రమైన భూమిని ఆనుకుని ఉన్న మిగిలిన భూమి ఫలం పట్టణంలో పనిచేసి జీవించే వారికి ఆధారంగా ఉంటుంది. అది పవిత్రమైన భూమిని ఆనుకుని తూర్పున ఐదు కిలోమీటర్ల 400 మీటర్లు, పడమటి వైపున ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల, ఉంటుంది. ఏ గోత్రపు వారైనా పట్టణంలో కష్టపడి జీవించేవారు దాన్ని సాగుబడి చేస్తారు. పవిత్రమైన భూమి అంతా 13 కిలోమీటర్ల 500 మీటర్ల నలు చదరంగా ఉంటుంది. పవిత్రమైన భూమికి, నగరానికి ఏర్పాటైన భూమికి రెండు వైపులా ఉన్న భూమి పాలకునిది. తూర్పున 13 కిలోమీటర్ల 500 మీటర్లు గల పవిత్రమైన భూమి నుండి అది తూర్పు సరిహద్దు వరకూ వ్యాపిస్తుంది. పడమర 13 కిలోమీటర్ల 500 మీటర్లు గల పవిత్రమైన భూమి నుండి అది పడమర సరిహద్దు వరకూ వ్యాపిస్తుంది. యూదా వారి సరిహద్దుకు, బెన్యామీనీయుల సరిహద్దుకు మధ్యగా ఉన్న భాగం పాలకునిది. ఆ భాగం లోనే లేవీయుల స్వాస్థ్యం, నగరానికి ఏర్పాటైన భూమి ఉంటాయి.

తూర్పు నుండి పడమటి వరకూ కొలవగా మిగిలిన గోత్రాలకు భాగాలు ఏర్పాటవుతాయి. బెన్యామీనీయులకు ఒక భాగం, వారి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగం. షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయులకు ఒక భాగం. ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగం. జెబూలూనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగం. దక్షిణదిక్కున తామారునుండి కాదేషులో ఉన్న మెరీబా ఊటలవరకూ నది వెంబడి మహా సముద్రం వరకూ గాదీయులకు సరిహద్దుగా ఉంటుంది. మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రాలకు పంచిపెట్టాల్సిన దేశం ఇదే. వారి వారి భాగాలు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ.

నగర ద్వారాలు, దేవుని సన్నిధి

నగర వైశాల్యం ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్లు. ఇశ్రాయేలీయుల గోత్రాల పేర్ల ప్రకారం నగర గుమ్మాలకు పేర్లు పెట్టాలి. ఉత్తరాన రూబేనుదనీ, యూదాదనీ, లేవీదనీ మూడు గుమ్మాలు ఉండాలి. తూర్పు వైపు 2 కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు ఉంది. ఆ వైపున యోసేపుదనీ, బెన్యామీనుదనీ, దానుదనీ, మూడు గుమ్మాలుండాలి. దక్షిణం వైపు రెండు కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు. ఆ వైపున షిమ్యోనుదనీ, ఇశ్శాఖారుదనీ, జెబూలూనుదనీ, మూడు గుమ్మాలుండాలి. పడమటి వైపు రెండు కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు. ఆ వైపున గాదుదనీ, ఆషేరుదనీ, నఫ్తాలిదనీ మూడు గుమ్మాలుండాలి. ఆ నగరం చుట్టు కొలత తొమ్మిది కిలోమీటర్ల, 700 మీటర్ల పొడవు. “యెహోవా ఉండే స్థలం1” అని ఆనాటి నుండి ఆ పట్టణానికి పేరు.

Source notes (1)
  1. Footnote యెహోవా ఉండే స్థలం యెహోవా షమ్మా

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.