Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

ద్వితీ 6

నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

“మీరూ మీ కొడుకులూ మీ మనుమలూ మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు, ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవితకాలమంతా పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు స్వాధీనం చేసుకోడానికి నది దాటి వెళ్తున్న దేశంలో మీరు పాటించడానికి మీకు బోధించాలని మీ యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలు, విధులు ఇవే.

ఇశ్రాయేలూ, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖశాంతులతో బాగా అభివృద్ధి చెందడానికి నువ్వు వాటిని విని, అనుసరించాలి.

ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు. నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.

మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.

అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.

మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళి, మీరు కట్టని గొప్ప, మంచి పట్టణాలను మీకు ఇస్తున్నాడు. మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇళ్ళనూ, మీరు తవ్వని బావులనూ, మీరు నాటని ద్రాక్షతోటలనూ ఒలీవ తోటలనూ మీకిస్తున్నాడు.

అక్కడ మీరు తిని, తృప్తి పొందినప్పుడు, బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త వహించాలి. మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి. మీరు ఇతర దేవుళ్ళను, అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్ళను పూజింపకూడదు.

మీ మధ్య ఉన్న మీ యెహోవా దేవుడు రోషం గల దేవుడు కాబట్టి ఆయన కోపాగ్ని మీ మీద చెలరేగి దేశంలో ఉండకుండాా మిమ్మల్ని నాశనం చేస్తాడు. మీరు మస్సాలో ఆయన్ని పరీక్షించిన విధంగా 1మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, అంటే ఆయన శాసనాలను, కట్టడలను జాగ్రత్తగా పాటించాలి.

మీకు సుఖశాంతులు కలిగేలా, మీ ఎదుట నుండి మీ శత్రువులందరినీ తరిమి వేస్తానని యెహోవా చెప్పిన ప్రకారం మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకొనేలా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనదీ ఉత్తమమైనదీ చేయాలి.

ఇక ముందు మీ కొడుకులు, మన యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడలు, విధులు ఏవి? అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వారితో ఇలా చెప్పాలి, మనం ఐగుప్తులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా తన బాహుబలంతో మనలను విడిపించాడు. యెహోవా ఐగుప్తు మీదా ఫరో మీదా అతని ఇంటివారందరి మీదా బాధాకరమైన, గొప్ప సూచకక్రియలూ అద్భుతాలూ మన కళ్ళ ఎదుట కనపరచి, తాను మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టడానికి అక్కడ నుండి మనలను రప్పించాడు.

మనం ఎప్పుడూ సుఖశాంతులు కలిగి ఈ రోజు ఉన్నట్టు మనం జీవించేలా మన యెహోవా దేవునికి భయపడి ఈ కట్టడలనన్నిటినీ పాటించాలని మనకు ఆజ్ఞాపించాడు. మన యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించిన విధంగా ఆయన ఎదుట ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ నడుచుకుంటే అదే మన విషయంలో నీతి అనిపించుకుంటుంది.”

Source notes (1)
  1. Footnote నిర్గమ 7:1-7 చూడండి.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.