Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

ద్వితీ 24

విడాకులు, మళ్ళి పెళ్ళికి చట్టాలు

“ఎవరైనా ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని, ఆ తరువాత ఆమె ఇంతకు ముందే పరాయి పురుషునితో లైంగికంగా సంబంధం కలిగి ఉన్నట్టు అనుమానం కలిగితే ఆమెపై అతనికి ఇష్టం తొలగిపోతే అతడు ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట్లోనుంచి ఆమెను పంపేయాలి. ఆమె అతని దగ్గర నుండి వెళ్లిపోయిన తరువాత వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు.

ఆ రెండోవాడు కూడా ఆమెను ఇష్టపడకుండా ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుంచి ఆమెను పంపి వేసినా, లేదా ఆమెను పెళ్ళిచేసుకున్న ఆ వ్యక్తి చనిపోయినా, ఆమెను తిరస్కరించిన ఆమె మొదటి భర్త ఆమెను తిరిగి పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఆమె అపవిత్రురాలు. అది యెహోవాకు అసహ్యం. కాబట్టి మీ యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇవ్వబోయే దేశానికి పాపం తెచ్చిపెట్టకూడదు.

కొత్తగా పెళ్ళిచేసుకున్న వాళ్ళు సైన్యంలో చేరకూడదు. వాళ్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు కులాసాగా తన ఇంట్లో ఉంటూ పెళ్లి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి.

తిరగలిని, తిరగటి పైరాతిని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే ఒకడి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్టే.

ఒకడు ఇశ్రాయేలు ప్రజల్లోని తన సోదరుల్లో ఎవరినైనా బలాత్కారంగా ఎత్తుకుపోయి అతణ్ణి తన బానిసగా చేసుకున్నా, లేదా అమ్మివేసినా అతణ్ణి చంపివేయాలి. అలా చేస్తే ఆ చెడుతనాన్ని మీ మధ్యనుంచి రూపుమాపిన వారవుతారు.

కుష్టురోగం విషయంలో యాజకులైన లేవీయులు మీకు బోధించే దాన్నంతా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. ఈ విషయంలో నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా జరిగించండి. మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు దారిలో మీ దేవుడైన యెహోవా మిర్యాముకు చేసిన దాన్ని గుర్తుంచుకోండి.

మీ పొరుగువాడికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు అతని దగ్గర తాకట్టు వస్తువు తీసుకొనేందుకు అతని ఇంటి లోపలికి వెళ్లకూడదు. ఇంటి బయటే నిలబడాలి. అప్పు తీసుకునేవాడు బయట నిలబడి ఉన్న నీ దగ్గరికి ఆ తాకట్టు వస్తువు తీసుకు వస్తాడు. అతడు పేదవాడైన పక్షంలో నువ్వు అతని తాకట్టు వస్తువు నీదగ్గరే ఉంచుకుని నిద్రపోకూడదు. అతడు తన దుప్పటి కప్పుకుని నిద్రబోయేముందు నిన్ను దీవించేలా సూర్యాస్తమయంలోగా తప్పకుండా ఆ తాకట్టు వస్తువును అతనికి తిరిగి అప్పగించాలి. అది మీ యెహోవా దేవుని దృష్టిలో మీకు నీతి అవుతుంది.

మీ సోదరుల్లో గానీ మీ దేశంలోని గ్రామాల్లో ఉన్న విదేశీయుల్లోగానీ దరిద్రులైన కూలివారిని బాధించకూడదు. ఏ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి. సూర్యుడు అస్తమించేలోగా అతనికి కూలి చెల్లించాలి. అతడు పేదవాడు కాబట్టి అతనికి వచ్చే సొమ్ము మీద ఆశ పెట్టుకుంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్ర పెడతాడేమో. అది నీకు పాపమవుతుంది.

కొడుకుల పాపాన్నిబట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల పాపాన్ని బట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవరి పాపానికి వారే మరణశిక్ష పొందాలి. పరదేశులకు గానీ తండ్రి లేనివారికి గానీ అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. విధవరాలి దుస్తులు తాకట్టుగా తీసుకోకూడదు. మీరు ఐగుప్తులో బానిసలుగా ఉండగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడనుంచి విమోచించాడని గుర్తుచేసుకోవాలి. అందుకే ఈ పనులు చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

మీ పొలంలో మీ పంట కోస్తున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోతే దాన్ని తెచ్చుకోడానికి మీరు తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. మీ ఒలీవ పండ్లను ఏరుకునేటప్పుడు మీ వెనక ఉన్న పరిగెను ఏరుకోకూడదు. అవి పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. మీ ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు మీ వెనకపడిపోయిన గుత్తిని ఏరుకోకూడదు. అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. మీరు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నారని గుర్తుచేసుకోండి. అందుకే ఈ పని చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.”

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.