ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
2 రాజులు 15
అజర్యా యూదా రాజు
15:1-7; 2దిన 26:3-4, 21-23
ఇశ్రాయేలురాజు యరొబాము పరిపాలనలో 23 వ సంవత్సరంలో యూదారాజు అమజ్యా కొడుకు అజర్యా పరిపాలన ఆరంభించాడు. అతడు 16 సంవత్సరాల వయస్సులో పరిపాలన ఆరంభించి యెరూషలేములో 52 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అతని తల్లి యెరూషలేము నివాసి యెకొల్యా. ఇతడు తన తండ్రి అమజ్యా చేసినట్టు చేసి యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించాడు.
అయితే అతడు ఉన్నత స్థలాలను మాత్రం నాశనం చెయ్యలేదు. ఉన్నత స్థలాల్లో ప్రజలు ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు. యెహోవా ఈ రాజును దెబ్బ కొట్టిన కారణంగా అతడు చనిపోయే వరకూ కుష్టురోగిగా ఉంటూ వేరుగా ఒక భవనంలో నివాసం ఉన్నాడు గనుక యువరాజు యోతాము పట్టణం మీద అధికారిగా దేశ ప్రజలకు న్యాయం తీర్చే వాడిగా ఉన్నాడు.
అజర్యా చేసిన పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. అజర్యా చనిపోయినప్పుడు అతణ్ణి తన పూర్వీకులతోబాటు దావీదు పట్టణంలో తన పితరుల సమాధిలో పాతిపెట్టిన తరువాత అతని కొడుకు యోతాము అతని స్థానంలో రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన జెకర్యా
యూదారాజు అజర్యా పరిపాలనలో 38 వ సంవత్సరంలో యరొబాము కొడుకు జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఆరు నెలలు పరిపాలించాడు. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలు విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ, తన పూర్వికులు చేసినట్టే తానూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
యాబేషు కొడుకు షల్లూము అతని మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు. జెకర్యా చేసిన పనులు గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. నీ కొడుకులు నాలుగో తరం వరకూ ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారని యెహోవా యెహూతో చెప్పిన మాట ప్రకారం ఇది జరిగింది.
ఇశ్రాయేలు రాజైన షల్లూము
యూదారాజు ఉజ్జియా పరిపాలనలో 39 వ సంవత్సరంలో యాబేషు కొడుకు షల్లూము పరిపాలన ఆరంభించి, షోమ్రోనులో నెల రోజులు ఏలాడు. గాదీ కొడుకు మెనహేము తిర్సాలో నుంచి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఉండే యాబేషు కొడుకు షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
షల్లూము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. మెనహేము వచ్చినప్పుడు తిప్సహు పట్టణం వారు తమ తలుపులు తెరవలేదు గనుక అతడు వాళ్ళందర్నీ హతం చేసి, తిర్సానూ దాని చుట్టూ ఉన్న గ్రామాలన్నిటినీ దోచుకుని అక్కడ ఉన్న గర్భవతుల గర్భాలు కత్తితో చీరివేశాడు.
ఇశ్రాయేలు రాజైన మెనహేము
యూదారాజు అజర్యా పరిపాలనలో 39 వ సంవత్సరంలో గాదీ కొడుకు మెనహేము ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి షోమ్రోనులో 10 సంవత్సరాలు ఏలాడు. ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
అష్షూరు రాజు పూలు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు, మెనహేము, తన రాజ్యం నిలిచి ఉండేలా పూలుతో సంధి చేసుకోవాలని పూలుకు 2,000 మణుగుల వెండి ఇచ్చాడు. మెనహేము, ఇశ్రాయేలులో ధనవంతులైన గొప్పవాళ్ళల్లో ప్రతి మనిషి దగ్గర 50 తులాల వెండి1 వసూలు చేసి ఈ ధనాన్ని అష్షూరు రాజుకు ఇచ్చాడు గనుక అష్షూరురాజు దేశాన్ని విడిచి వెళ్లిపోయాడు.
మెనహేము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. మెనహేము తన పూర్వీకులతోబాటు తానూ చనిపోయిన తరువాత అతని కొడుకు పెకహ్యా అతని స్థానంలో రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన పెకహ్యా
యూదారాజు అజర్యా పరిపాలనలో 50 వ సంవత్సరంలో మెనహేము కొడుకు పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి రెండు సంవత్సరాలు ఏలాడు. ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచి పెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
ఇతని కింద ఉన్న అధిపతీ రెమల్యా కొడుకూ అయిన పెకహు కుట్ర చేసి, తన దగ్గరున్న 50 మంది గిలాదు వారితోనూ, అర్గోబుతోనూ, అరీహేనుతోనూ చేతులు కలిపి షోమ్రోనులో ఉన్న రాజ నగరులోని అంతఃపురంలో పెకహ్యాను చంపి, అతని స్థానంలో రాజయ్యాడు. పెకహ్యా చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
ఇశ్రాయేలు రాజైన పెకహు
యూదా రాజు అజర్యా పరిపాలనలో 52 వ సంవత్సరంలో రెమల్యా కొడుకు పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలడం ఆరంభించి 20 సంవత్సరాలు ఏలాడు. ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచి పెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
ఇశ్రాయేలు రాజు పెకహు రోజుల్లో అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు వచ్చి ఈయోను పట్టణాన్ని, ఆబేల్బేత్మయకా పట్టణాన్ని, యానోయహు పట్టణాన్ని, కెదెషు పట్టణాన్ని, హాసోరు పట్టణాన్ని, గిలాదు ప్రాంతాన్ని, గలిలయ ప్రాంతాన్ని, నఫ్తాలీ ప్రాంతమంతా చెరపట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళను అష్షూరు దేశానికి బందీలుగా తీసుకు పోయాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు, రెమల్యా కొడుకు అయిన పెకహు మీద ఏలా కొడుకు హోషేయ కుట్ర చేసి, అతనిపై దాడి చేసి చంపి అతని స్థానంలో తాను రాజయ్యాడు. ఇది యూదా రాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలనలో 20 వ సంవత్సరంలో జరిగింది. పెకహు చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
యూదా రాజైన యోతాము
15:33-38; 2దిన 27:1-4, 7-9
ఇశ్రాయేలు రాజు, రెమల్యా కొడుకు అయిన పెకహు పరిపాలనలో రెండో సంవత్సరంలో యూదా రాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలన ఆరంభించాడు. అతడు 25 సంవత్సరాల వయస్సులో యెరూషలేములో రాజై 16 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి సాదోకు కూతురు యెరూషా.
ఇతడు యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించి తన తండ్రి ఉజ్జియా ఆదర్శాన్ని పూర్తిగా అనుసరించాడు. అయినా ఉన్నత స్థలాలను కూల్చివేయలేదు. ప్రజలు ఉన్నత స్థలాల్లో ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు. ఇతడు యెహోవా మందిరానికి ఉన్న ఎత్తయిన ద్వారాన్ని కట్టించాడు. యోతాము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
ఆ కాలంలో యెహోవా సిరియా రాజు రెజీనునూ, రెమల్యా కొడుకు పెకహునూ యూదా దేశం మీదికి పంపించడం ఆరంభించాడు. యోతాము తన పూర్వీకులతోబాటు చనిపోగా, అతని పూర్వీకుడు దావీదు పట్టణంలో అతని పితరుల సమాధిలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతని స్థానంలో రాజయ్యాడు.
Source notes (1)
- Footnote 50 తులాల వెండి 570 గ్రాము
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.