Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 కొరింతీ పత్రిక 7

ప్రియమైన కొరింతు విశ్వాసులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి, కాబట్టి దేవుని మీద భయభక్తులతో పరిపూర్ణమైన పరిశుద్ధత కోసం తపన పడుతూ దేహానికీ ఆత్మకూ అంటిన మురికినంతా కడుక్కుందాం.

పౌలు హృదయం

మమ్మల్ని మీ హృదయాల్లో చేర్చుకోండి. మేమెవరికీ హాని చేయలేదు. ఎవరికీ అపకారం తలపెట్టలేదు. ఎవరినీ స్వార్థానికి వినియోగించుకోలేదు. మీ మీద నింద మోపాలని నేనిలా అనడం లేదు. మీరు మా హృదయాల్లో ఉన్నారు. మీతో పాటు చావడానికైనా జీవించడానికైనా సిద్ధంగా ఉన్నామని నేను ముందే చెప్పాను.

నేను చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీ గురించి నేనెంతో గర్విస్తున్నాను. నిండు ఓదార్పుతో ఉన్నాను. మాకు బాధలెన్నున్నా సరే ఆనందంతో పొంగి పోతున్నాను. మేము మాసిదోనియ వచ్చినప్పుడు మా శరీరాలకు ఎంత మాత్రం విశ్రాంతి దొరకలేదు. అన్నివైపులా మాకు కష్టాలే. బయట పోరాటాలు, లోపల భయాలు ఉన్నాయి.

కానీ కృంగిన వారిని ఆదరించే దేవుడు, తీతు రాక ద్వారా మమ్మల్ని ఆదరించాడు. తీతు రాక వలన మాత్రమే కాక, అతడు మీ దగ్గర పొందిన ఆదరణ వలన కూడా దేవుడు మమ్మల్ని ఆదరించాడు. నాపై ఉన్న మీ అభిమానం, నా పట్ల మీ దుఃఖం, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలియజేశాడు. కాబట్టి నేను మరెక్కువగా ఆనందించాను.

నా లేఖ మీకు దుఃఖం కలిగించినా, అది రాసినందుకు నేను బాధ పడటం లేదు. అది మీకు కొంత దుఃఖం కలిగించిందని నాకు తెలుసు. అది నాకు కూడా దుఃఖం కలిగించింది. అయినా అది కొంచెం సేపు మాత్రమే. కాని ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీరు విచారించారని ఆనందించడం లేదు గానీ మీ విచారం పశ్చాత్తాపపడేలా చేసింది. మీరు దైవిక విచారాన్ని అనుభవించారు. అందువల్ల మా వలన ఎలాంటి నష్టమూ మీరు పొందలేదు.

దైవిక విచారం పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దాని వలన విచారం కాదు, రక్షణ లభిస్తుంది. అయితే లోకానుసారమైన విచారం చావును తెస్తుంది. దైవిక విచారం మీలో ఎలాంటి పట్టుదల తెచ్చిందో చూడండి. మీరు నిర్దోషులని రుజువు చేసే ఎలాంటి గొప్ప పట్టుదల, ఎలాంటి రోషం, ఎలాంటి భయభక్తులు, ఎలాంటి తపన, ఎలాంటి ఆసక్తి, ప్రతి దానిలో న్యాయం తప్పక జరగాలనే ఎలాంటి ఆశ, మీలో కలిగాయో చూడండి! ఆ విషయంలో అన్ని విధాలుగా మీరు నిర్దోషులని నిరూపించుకున్నారు. నేను మీకు రాసినా ఆ చెడ్డ పని చేసినవాడి కోసం రాయలేదు. వాడి వలన అన్యాయం పొందిన వాడి కోసం కూడా రాయలేదు. అయితే మా పట్ల మీకున్న ఆసక్తి దేవుని దృష్టిలో మీకు తెలియడానికే రాశాను.

వీటన్నిటితో మాకెంతో ప్రోత్సాహం లభించింది. అంతే కాదు, తీతు పొందిన ఆనందం ద్వారా మాకు మరెక్కువ ఆనందం కలిగింది. మీ అందరి వలన అతని ఆత్మకు ఊరట కలిగింది. ఎందుకంటే నేనతనికి మీ గురించి గొప్పగా చెప్పిన విషయాల్లో మీరు నన్ను సిగ్గుపరచలేదు. దీనికి భిన్నంగా మేము మీతో చెప్పినదంతా ఎలా వాస్తవమో అలాగే మేము మీ గురించి తీతుకు గొప్పగా చెప్పినదంతా వాస్తవమని తేలింది. మీరు అతన్ని భయంతో, వణుకుతో చేర్చుకుని విధేయత చూపిన సంగతి జ్ఞాపకం చేసుకున్నపుడు అతనికి మీ పట్ల ప్రేమ అధికమయ్యింది. ప్రతి విషయంలో మీ గురించి నాకు ఉన్న నమ్మకాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.