Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 సమూ 22

అదుల్లాము, మిస్పాకు పారిపోవడం దావీదు

దావీదు అక్కడనుండి తప్పించుకుని బయలుదేరి అదుల్లాము గుహలోకి వెళితే, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివాళ్ళంతా ఆ సంగతి విని అతని దగ్గరికి వచ్చారు. ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల పాలైన వాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళంతా అతని దగ్గరికి వచ్చి చేరారు. అతడు వారికి నాయకుడయ్యాడు. అతని దగ్గర దాదాపు 400 మంది చేరారు.

తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పాకు వచ్చి “దేవుడు నాకు ఏమి చేస్తాడో నేను తెలుసుకొనేంత వరకూ నా తలిదండ్రులను నీ దగ్గర ఉండనివ్వు” అని మోయాబు రాజును అడిగి, వారిని అతనికి అప్పగించాడు. దావీదు దాక్కుని ఉన్న రోజుల్లో వారు మోయాబు రాజు దగ్గర ఉండిపోయారు. ఆ తరువాత గాదు ప్రవక్త వచ్చి “కొండల్లో ఉండకుండాా యూదా దేశానికి పారిపో” అని దావీదుతో చెప్పడంవల్ల దావీదు వెళ్ళి హారెతు అడవిలో దాక్కున్నాడు.

నోబులో యాజకులను సౌలు చంపడం

దావీదు, అతని అనుచరులు ఫలానా చోట ఉన్నారని సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియా దగ్గర రమాలో ఒక కర్పూర వృక్షం కింద చేతిలో ఈటె పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలబడి ఉన్నారు.

సౌలు తన చుట్టూ నిలబడి ఉన్న సేవకులతో ఇలా అన్నాడు “బెన్యామీనీయులారా, వినండి. యెష్షయి కొడుకు మీకు పొలాలు, ద్రాక్షతోటలు ఇస్తాడా? మిమ్మల్ని వందమంది, వెయ్యిమంది సైనికులపై అధిపతులుగా చేస్తాడా? మీరెందుకు నా మీద కుట్ర పన్నుతున్నారు? నా కొడుకు యెష్షయి కొడుకుతో ఒప్పందం చేసుకున్నాడని మీలో ఎవరూ నాతో చెప్పలేదే. ఈ రోజు జరుగుతున్నట్టు నా కోసం కాపు కాసేలా నా కొడుకు నా సేవకుడు, దావీదును రెచ్చగొట్టినా, నా విషయంలో మీలో ఎవరికీ విచారం లేదు” అన్నాడు.

అప్పుడు ఎదోమీయుడు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలబడి “యెష్షయి కొడుకు పారిపోయి నోబులో ఉంటున్న అహీటూబు కొడుకు అహీమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు నేను చూశాను. అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారం, ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గం అతనికి ఇచ్చాడు” అని చెప్పాడు. రాజు, యాజకుడూ అహీటూబు కొడుకు అయిన అహీమెలెకును, నోబులో ఉన్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరినీ పిలిపించాడు. వారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, సౌలు “అహీటూబు కొడుకా, విను” అన్నప్పుడు, అతడు “నా యజమానీ, చెప్పండి” అన్నాడు.

సౌలు “నువ్వు, యెష్షయి కొడుకు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారేంటి? నీవు అతనికి భోజనం, కత్తి ఇచ్చి అతనికి సహాయ పడమని దేవుని దగ్గర విన్నపం చేసావు. నేడు జరుగుతూ ఉన్నట్టు అతడు నానుండి దాక్కుని, రేపు నాపై తిరగబడతాడు గదా?” అన్నాడు. అహీమెలెకు “రాజా, నీకు దావీదు కంటే నమ్మకమైనవాడు నీ సేవకులందరిలో ఎవరు ఉన్నారు? పైగా అతడు నీ అల్లుడు. రాజు సైన్యపు బాధ్యతలు నేరవేరుస్తూ నీ నగరంలో పేరుగాంచిన దావీదు వంటి గౌరవనీయుడు ఎవరున్నారు? ఈ సంగతి గూర్చి కొంచెం కూడా నాకు తెలియదు. అతని తరపున నేను దేవుని దగ్గర విచారణ చేయడం ఇప్పుడే మొదలుపెట్టానా? రాజు అలా భావించకూడదు. రాజు తమ దాసుడనైన నా మీదా నా తండ్రి ఇంటి వారందరిమీదా ఈ నేరం మోపకూడదు” అని రాజుకు జవాబిచ్చాడు. రాజు “అహీమెలెకూ, నీకూ, నీ తండ్రి ఇంటివారికందరికీ చావు తప్పదు” అన్నాడు. “వీరు దావీదుతో చేతులు కలిపారు. అతడు పారిపోయిన సంగతి తెలిసినప్పటికీ నాకు చెప్ప లేదు. కాబట్టి యెహోవా యాజకులైన వీరిని వధించండి” అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులను ఆజ్ఞాపించాడు. సైనికులు యెహోవా యాజకులను చంపడానికి వెనకడుగు వేశారు.

రాజు దోయేగును చూసి “నువ్వు ఈ యాజకుల మీద పడి చంపు” అని చెప్పాడు. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు, యాజకుల పై దాడిచేసి ఏఫోదు ధరించుకుని ఉన్న 85 మందిని చంపాడు. ఇంకా యాజకుల పట్టణమైన నోబులొ కాపురం ఉంటున్నవారిని కత్తితో చంపేశాడు. మగవాళ్ళను, ఆడవాళ్ళను, చిన్నపిల్లలను, పసిపిల్లలను, ఎద్దులను, గాడిదలను, అన్నిటినీ కత్తితో చంపేశాడు.

అయితే అహీటూబు కొడుకైన అహీమెలెకు కొడుకుల్లో ఒకడైన అబ్యాతారు తప్పించుకుని పారిపోయి దావీదు దగ్గరికి వచ్చి, సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదుకు తెలియచేసారు.

దావీదు “ఆ రోజు ఎదోమీయుడైన దోయేగు అక్కడే ఉండడంవల్ల వాడు సౌలుకు కచ్చితంగా ఈ సంగతి చెబుతాడని నేననుకొన్నాను. నీ తండ్రి యింటివారందరి మరణానికి నేనే కారకుడనయ్యాను. నువ్వు భయం లేకుండా నా దగ్గరే ఉండు. నా దగ్గర నువ్వు క్షేమంగా ఉంటావు. నన్నూ నిన్నూ చంపాలని చూసేవాడు ఒక్కడే” అని అబ్యాతారుతో చెప్పాడు.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.