Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 దిన 17

దావీదుతో దేవుని ఒడంబడిక

17:1-15; 2సమూ 7:1-17

దావీదు తన ఇంటికి వెళ్లి సేదదీరిన తరువాత ప్రవక్త అయిన నాతానును పిలిపించి అతనితో “నేను దేవదారుకలపతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను. కాని, యెహోవా నిబంధన మందసం మాత్రం ఒక గుడారంలో ఉంది” అని చెప్పాడు. అప్పుడు నాతాను “దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నదంతా చెయ్యి” అని దావీదుతో అన్నాడు.

ఆ రాత్రి దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, “నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు. యెహోవా చెప్పేదేమంటే, నా నివాసం కోసం ఒక ఆలయాన్ని నువ్వు కట్టించకూడదు. ఇశ్రాయేలీయులను రప్పించిన రోజు నుంచి ఈ రోజు వరకూ నేను ఒక ఇంట్లో నివాసం చెయ్యకుండా, డేరాలో, ప్రత్యక్ష గుడారంలో నివాసం చేశాను. నేను ఇశ్రాయేలీయులందరి మధ్యలో సంచారం చేసిన కాలంలో, మీరు నాకోసం దేవదారు మానులతో ఆలయం ఎందుకు కట్టలేదు? అని నా ప్రజలను కాయడానికి నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనా నేను ఒక్క మాటైనా అన్నానా?

కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఏం చెప్పాలంటే, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు, గొర్రెల వెంట తిరుగుతున్న నిన్ను గొర్రెల మంద నుంచి తీసుకు, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా చేశాను. నువ్వు వెళ్లిన ప్రతిచోటా నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవాళ్ళను నీ ముందు నిలవకుండా నిర్మూలం చేశాను. లోకంలో ఘనులకు ఉన్న పేరులాంటి పేరు నీకు ఉండేలా చేస్తాను.

ఇంకా నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం ఒక స్థలం ఏర్పాటు చేసి, వాళ్ళను అక్కడ నాటుతాను. వాళ్ళు ఇంక తిరుగులాడకుండా తమ స్థానంలో కాపురం ఉంటారు. పూర్వం జరిగినట్టూ, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకుని జరుగుతూ వచ్చినట్టూ, దుష్టులు వాళ్ళను ఇక బాధ పెట్టరు. నీ పగవాళ్ళందరినీ నేను అణచివేస్తాను. అంతమాత్రమే కాదు, యెహోవానైన నేను నీ తరువాత నీ సంతానమే పరిపాలిస్తుందని నీకు తెలియజేశాను.

నీ జీవితకాలం ముగిసి నీ పూర్వీకుల దగ్గరికి నువ్వు చేరే సమయానికి, నీ తరువాత నీ కొడుకుల వల్ల కలిగే నీ సంతానాన్ని లేపుతాను. వాళ్ళల్లో ఒకరి ద్వారా నేను రాజ్య స్థాపనచేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అతడు నాకు ఒక మందిరం కట్టిస్తాడు. అతని సింహాసనాన్ని నేను శాశ్వతమైనదిగా చేస్తాను.

నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నీ మీద పరిపాలించిన సౌలు దగ్గరనుండి తీసి వేసినట్టుగా అతని దగ్గరనుండి నా నిబంధన విశ్వాస్యత తీసివేయను. నా మందిరంలో, నా రాజ్యంలో, నేను నిత్యం అతన్ని స్థిరపరుస్తాను, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరంగా ఉంటుంది అని అతనికి తెలియచెయ్యి.”

నాతాను తనకు ప్రత్యక్షం అయిన యీ మాటలన్నిటినీ దావీదుకు తెలియజేశాడు.

దావీదు ప్రార్థన

17:16-27; 2సమూ 7:18-29

రాజైన దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుని ఈ విధంగా మనవి చేశాడు. “దేవా యెహోవా, నువ్వు నన్ను ఇలాటి ఉన్నత స్థితికి తేవడానికి నేను ఎంతటివాణ్ణి? నా కుటుంబం ఏమాత్రం? దేవా, ఇది నీ దృష్టిలో చిన్న విషయమే. దేవా యెహోవా, నువ్వు దూర భవిషత్తులో ఉండబోయే నీ సేవకుని సంతతినిగూర్చి చెప్పి, ముందు తరాలను నాకు చూపించావు. నీ దాసుడైన నాకు కలుగబోయే ఘనతను గూర్చి దావీదు అనే నీ దాసుడనైన నేను నీతో ఇంకా ఏమని మనవి చెయ్యను? నువ్వు నీ దాసునికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చావు.

యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారం ఈ మహా ఘనత కలుగుతుందని నువ్వు తెలియచేశావు. అతని నిమిత్తమే నువ్వు ఈ గొప్ప కార్యం చేశావు. యెహోవా, మేము మా చెవులతో విన్నదంతా నిజం. నీలాంటివాడు ఎవ్వడూ లేడు. నువ్వు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాంటి జాతి భూలోకంలో ఏది? ఐగుప్తులోనుంచి నువ్వు విమోచించిన నీ ప్రజల ముందు నిలబడనివ్వకుండా నువ్వు అనేక జాతులను తోలివేసినందువల్ల మహా భీకరమైన పేరు తెచ్చుకొన్నావు. వాళ్ళు నీ సొంత ప్రజలయ్యేలా వాళ్ళను విమోచించడానికి దేవుడవైన నువ్వు బయలుదేరావు.

నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నిత్యం నీకు ప్రజలయ్యేలా నువ్వు ఆ విధంగా చేశావు. యెహోవావైన నువ్వు వాళ్లకు దేవుడివయ్యావు. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చీ, అతని సంతతిని గూర్చీ నువ్వు చెప్పిన మాట నిత్యం స్థిరమౌతుంది గాక. ఇశ్రాయేలీయుల దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరుకు ఎన్నటికీ ఘనత వచ్చేలా నువ్వు చెప్పిన మాట నిశ్చయంగా స్థిరమౌతుంది గాక. ఇంకా, నీ దాసుడైన దావీదు సంతతి నీ సన్నిధిలో స్థిరపడు గాక.

దేవా, నీకు సంతానం ఇస్తానని నీ దాసునికి నువ్వు తెలియచేశావు గనుక నీ సన్నిధిలో విన్నపం చెయ్యడానికి నీ దాసునికి ధైర్యం కలిగింది. యెహోవా, నువ్వు దేవుడవై ఉండి, నీ దాసునికి ఈ మేలు దయచేస్తానని చెప్పావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యం నీ సన్నిధిలో ఉండేలా దాన్ని ఆశీర్వదించడానికి నీకు ఇష్టం అయింది. యెహోవా, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది.”

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.