Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 దినవృత్తాంతములు 6

అప్పుడు సొలొమోను, “యెహోవా తాను చీకటి మేఘంలో నివసిస్తారని ఆయన చెప్పారు; నేను మీ కోసం ఘనమైన మందిరాన్ని కట్టించాను. అది మీరు ఎల్లకాలం నివసించగలిగే స్థలం” అని అన్నాడు.

ఇశ్రాయేలు సమాజమంతా అక్కడ నిలబడి ఉండగా రాజు వారివైపు తిరిగి, వారిని దీవించాడు. అప్పుడతడు ఇలా అన్నాడు:

“నా తండ్రియైన దావీదుకు మాట ఇచ్చి తన హస్తంతో దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు: ‘ఈజిప్టు నుండి నేను నా ప్రజలను తీసుకువచ్చిన రోజు నుండి, నా పేరిట మందిరం కట్టించుకోడానికి ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన పట్టణాల్లో దేనినీ నేను ఎన్నుకోలేదు, నా ప్రజలను పరిపాలించడానికి ఏ రాజును నేను ఎన్నుకోలేదు. అయితే ఇప్పుడు నా పేరు ఉండేలా యెరూషలేమును ఎన్నుకున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నాను.’

“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరం కట్టించాలనే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉండింది. కాని యెహోవా నా తండ్రియైన దావీదుతో, ‘నా పేరున మందిరాన్ని కట్టించాలనే ఆశ నీ హృదయంలో ఉండడం మంచిదే. అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.

“యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను. యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనను తెలిపే మందసాన్ని మందిరంలో అక్కడ పెట్టాను.”

సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ చేసిన ప్రార్థన

అప్పుడు సొలొమోను యెహోవా బలిపీఠం ముందు ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో నిలబడి చేతులు చాపి ప్రార్థన చేశాడు. తర్వాత సొలొమోను అయిదు మూరల పొడవు, అయిదు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తుతో1 ఒక ఇత్తడి వేదికను తయారుచేసి, బయటి ఆవరణ మధ్యలో ఉంచాడు. అతడు వేదికపై నిలబడి, ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో మోకరిల్లి, ఆకాశం వైపు చేతులు చాపాడు. అతడు ఇలా ప్రార్థించాడు:

“యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు. మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు; మీ నోటితో చేసిన వాగ్దానాన్ని ఈ రోజున కనబడుతున్నట్టుగా మీ చేతులతో నెరవేర్చారు.

“ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో, ‘నీ వారసులు తమ ప్రవర్తన విషయంలో జ్రాగత్తగా ఉంటూ, నీలా నా ఎదుట నా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తే, ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ సంతానంలో ఉండక పోడు’ అని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీ సేవకుడైన దావీదుతో మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి.

“అయితే దేవుడు భూమి మీద మనుష్యులతో నిజంగా నివాసం చేస్తారా? ఆకాశ మహాకాశాలు మీకు సరిపోవు. నేను కట్టించిన ఈ మందిరం ఏం సరిపోతుంది? అయినా యెహోవా నా దేవా, మీ దాసుడైన నేను చేసే ప్రార్థన, కనికరం కోసం చేసే విన్నపం ఆలకించండి. మీ దాసుడు మీ సన్నిధిలో చేసే మొరను, ప్రార్థనను వినండి. మీ పేరు అక్కడ ఉంటుందని మీరు చెప్పిన స్థలం వైపు తిరిగి మీ దాసుడు చేసే ప్రార్థన మీరు వినేలా రాత్రింబగళ్ళు మీ కనుదృష్టి ఈ మందిరంపై ఉండును గాక. మీ దాసుడు, మీ ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి విన్నపాలు ఆలకించండి. మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి; మీరు విన్నప్పుడు క్షమించండి.

“ఎవరైనా తన పొరుగువారి పట్ల తప్పు చేశారని ఆరోపించబడి వారు ప్రమాణం చేయాల్సివస్తే ఈ మందిరంలో మీ బలిపీఠం ముందు ఆ ప్రమాణం చేసినప్పుడు, మీరు ఆకాశం నుండి విని మీ దాసులకు న్యాయం తీర్చండి. దోషులను వారి దోషం బట్టి శిక్షిస్తూ, నిర్దోషుల నిర్దోషత్వాన్ని బట్టి వారి నిర్దోషత్వాన్ని నిర్ధారించండి.

“మీ ఇశ్రాయేలు ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు వారి శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు మీ వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఈ మందిరం ఎదుట మిమ్మల్ని వేడుకున్నప్పుడు, మీరు పరలోకం నుండి విని, మీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారికి వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశానికి వారిని మళ్ళీ తీసుకురండి.

“మీ ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు, ఆకాశం మూయబడి వర్షం లేనప్పుడు, వారు తమకు కలిగిన శ్రమ వలన తమ పాపం విడిచిపెట్టి ఈ స్థలం వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తే, మీరు పరలోకం నుండి విని, మీ దాసులు, మీ ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని క్షమించండి. సరైన మార్గాన్ని అనుసరిస్తూ జీవించాలని వారికి బోధించండి, మీ ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో వర్షం కురిపించండి.

“దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా, మీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా తమ వేదన బాధలు తెలుసుకొని ఈ మందిరం వైపు తమ చేతులను చాచి ప్రార్థన విన్నపం చేస్తే, ప్రతి మనిషి హృదయం మీకు తెలుసు కాబట్టి మీ నివాసస్థలమైన పరలోకం నుండి విని క్షమించి, ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమివ్వండి (ఎందుకంటే ప్రతి మానవ హృదయం మీకు తెలుసు), అప్పుడు మీరు మా పూర్వికులకిచ్చిన ఈ దేశంలో వారు బ్రతికి ఉన్నంత కాలం మీకు భయపడి, మీకు విధేయులై మీ మార్గంలో వారు నడుస్తారు.

“మీ ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించని విదేశీయులు, మీ గొప్ప పేరును బట్టి, మీ బలమైన బాహువును చాచిన మీ చేతులను బట్టి దూరదేశం నుండి వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి. విదేశీయులు మిమ్మల్ని ఏమి అడిగినా అది వారికి చేయండి. అప్పుడు భూలోక ప్రజలు మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా మీ పేరు తెలుసుకొని మీకు భయపడతారు. నేను కట్టిన ఈ మందిరం మీ పేరు కలిగి ఉందని తెలుసుకుంటారు.

“మీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు, మీరు వారిని ఎక్కడికి పంపినా, మీరు ఎన్నుకున్న ఈ పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి, వారు మీకు ప్రార్థన చేస్తే, అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి.

“పాపం చేయని మనుష్యులు లేరు కాబట్టి వారు మీకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు, మీరు వారిపై కోప్పడి శత్రువులకు అప్పగిస్తే, వారు వీరిని దూరంగా లేదా దగ్గరగా ఉన్న దేశానికి బందీలుగా తీసుకెళ్తారు; అప్పుడు వారు బందీగా ఉన్న దేశంలో వారి హృదయాలు మారి పశ్చాత్తాపపడి, ‘మేము తప్పు చేసి దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాం’ అని వారు వేడుకుంటే, తాము బందీగా ఉన్న దేశంలో వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో మరలా మీ వైపు తిరిగి, వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశం వైపు, మీరు ఎన్నుకున్న పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, అప్పుడు మీ నివాసస్థలమైన పరలోకం నుండి వారి ప్రార్థన, వారి విన్నపాలను విని వారి పక్షాన ఉండండి. మీకు విరుద్ధంగా పాపం చేసిన మీ ప్రజలను క్షమించండి;

“నా దేవా! ఈ స్థలంలో చేసిన ప్రార్థనపై మీ కనుదృష్టి ఉంచండి. చెవులారా ఆలకించండి.

“యెహోవా దేవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో,

మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి.

యెహోవా దేవా! మీ యాజకులు రక్షణను ధరించుకొందురు గాక!

మీ మంచితనాన్నిబట్టి నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషించుదురు గాక!

యెహోవా దేవా! మీ అభిషిక్తుని తిరస్కరించకండి.

మీ సేవకుడైన దావీదు మీద మీ మారని ప్రేమను చూపుతానని మీరు చేసిన వాగ్దానాలు జ్ఞాపకముంచుకోండి.”

Source notes (1)
  1. Footnote అంటే, సుమారు 2.3 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల ఎత్తు

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.