Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యోనా 2
చేప కడుపులో నుండి యోనా తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. అతడు ఇలా ప్రార్థించాడు:
“నా ఆపదలో నేను యెహోవాకు మొరపెట్టాను,
ఆయన నాకు జవాబిచ్చారు.
మృత్యులోకంలో ఉండి సహాయం కోసం అడిగాను,
మీరు నా మొర విన్నారు.
మీరు నన్ను అగాధంలో
సముద్ర గర్భంలో పడవేశారు.
ప్రవాహాలు నన్ను ఆవరించాయి,
మీ అలలు, తరంగాలు
నన్ను ముంచి వేశాయి.
‘నేను మీ సన్నిధి నుండి
నన్ను తరిమివేసినా
మరలా నేను పరిశుద్ధ ఆలయం వైపు
తిరిగి చూస్తాను’ అనుకున్నాను.
ముంచివేసే నీళ్లు నన్ను భయపెట్టాయి,1
అగాధం నన్ను ఆవరించింది;
సముద్రంలో ఉన్న నాచు నా తలకు చుట్టుకుంది.
పర్వతాల పునాదుల వరకు నేను మునిగాను,
క్రిందున్న భూమి గడియలు నన్ను శాశ్వతంగా బంధించాయి.
అయితే నా దేవా! యెహోవా,
మీరు నా ప్రాణాన్ని గోతిలో నుండి పైకి తీసుకువచ్చారు.
“నా ప్రాణం క్షీణిస్తూ ఉంటే,
యెహోవా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను.
నా ప్రార్థన మీ దగ్గరకు వచ్చింది,
మీ పరిశుద్ధ ఆలయానికి చేరింది.
“విలువలేని విగ్రహాలను పూజించేవారు,
తమ పట్ల దేవునికున్న ప్రేమకు దూరమవుతారు.
నేనైతే కృతజ్ఞత స్తుతులు చేస్తూ
మీకు బలి అర్పిస్తాను.
నేను చేసిన మ్రొక్కుబడి చెల్లిస్తాను,
‘రక్షణ యెహోవా నుండి వస్తుంది’ అని అంటాను.”
యెహోవా ఆ చేపకు ఆజ్ఞాపించగా అది యోనాను పొడినేల మీద కక్కివేసింది.
Source notes (1)
- Footnote లేదా నీళ్లు నా గొంతు వరకు ఉన్నాయి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.