Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

హెబ్రీ పత్రిక 13

ముగింపు హెచ్చరికలు

సహోదరీ సహోదరులుగా, ఒకరిని ఒకరు ఎల్లప్పుడు ప్రేమిస్తూ ఉండండి. క్రొత్తవారికి ఆతిథ్యం ఇవ్వడం మరువవద్దు, ఎందుకంటే క్రొత్తవారికి ఆతిథ్యం ఇస్తుండడం వలన కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు. చెరసాలలో ఉన్నవారిని మీరు కూడా వారితో పాటు చెరసాలలో ఉన్నట్లుగా, బాధలుపడుతున్న వారితో మీరు కూడా ఆ బాధల్లో వారితో ఉన్నట్లుగా వారిని జ్ఞాపకం చేసుకోండి.

పెళ్ళి అందరిచేత గౌరవించబడాలి, పెళ్ళి పాన్పు శుద్ధమైనదిగా ఉండాలి, ఎందుకంటే దేవుడు వ్యభిచారులను లైంగిక అనైతికత గల వారందరిని తీర్పు తీరుస్తాడు. మీ జీవితాలను ధన వ్యామోహానికి దూరంగా ఉంచండి, మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందండి, ఎందుకంటే దేవుడు ఇలా అన్నాడు,

“నేను నిన్ను ఎన్నడు విడిచిపెట్టను;

నిన్ను ఎన్నడు త్రోసివేయను.”1

కాబట్టి మనం ధైర్యంతో ఇలా చెబుదాం,

“ప్రభువే నాకు సహాయకుడు; నేను భయపడను.

నరమాత్రులు నన్నేమి చేయగలరు?”2

దేవుని వాక్యాన్ని మీకు బోధించిన మీ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవిత విధానం వలన కలిగిన ఫలితాన్ని తెలుసుకోండి, వారి విశ్వాసాన్ని అనుకరించండి. యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకే విధంగా ఉన్నాడు.

అన్ని రకాల వింత బోధలచేత దూరంగా వెళ్లిపోకండి. ఆచార సంబంధమైన ఆహారం తినడం వల్ల కాదు, కాని కృప చేత మన హృదయాలు బలపరచబడటం మంచిది; ఆచారాలను పాటించే వారికి ఏ ప్రయోజనం కలుగదు. మనకు ఒక బలిపీఠం ఉంది, అయితే ప్రత్యక్షగుడారంలో పరిచర్య చేసేవారికి దాని నుండి తీసుకుని తినే అధికారం లేదు.

ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని పాపపరిహారబలిగా అతి పరిశుద్ధ స్థలం లోపలికి తీసుకెళ్తాడు, కాని వాటి శరీరాలు శిబిరం బయటే దహించబడతాయి. కాబట్టి, యేసు కూడా తన రక్తం చేత ప్రజలను పాపాల నుండి శుద్ధి చేయడానికి పట్టణ ద్వారానికి బయటే బాధపడ్డాడు. కాబట్టి మనం కూడా శిబిరం బయట ఉన్న ఆయన దగ్గరకు వెళ్లి ఆయన భరించిన అవమానాన్ని మనం కూడా భరిద్దాము. ఎందుకంటే మనకు ఇక్కడ శాశ్వతమైన పట్టణం లేదు, అయితే రాబోతున్న పట్టణం కోసం మనం ఎదురుచూస్తున్నాము.

కాబట్టి, యేసు ద్వారా, ఆయన పేరును బహిరంగంగా ఒప్పుకునే పెదవుల ఫలంతో మనం నిరంతరం దేవునికి స్తుతి బలిని అర్పిద్దాము. ఉపకారం చేయడం, ఇతరులతో పంచుకోవడం అనే యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి.

మీ నాయకులపై నమ్మకం ఉంచండి, వారి అధికారానికి లోబడి ఉండండి, ఎందుకంటే వారు మీ ఆత్మలను గురించి లెక్క అప్పగించాల్సిన వారుగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వారు తమ పనిని భారంగా భావించి చేస్తే, మీకు ఏ ప్రయోజనం ఉండదు, కాబట్టి వారు చేయవలసిన పనిని భారంగా కాకుండా ఆనందంగా చేసేలా చూడండి.

మాకోసం ప్రార్థించండి. మేము అన్ని విధాలుగా గౌరవప్రదంగా జీవించాలనే ఆశ కలిగి స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాము. త్వరలో నేను మిమ్మల్ని కలుసుకొనేలా నా కోసం ప్రార్థించమని మిమ్మల్ని ప్రత్యేకంగా బ్రతిమాలుతున్నాను.

ఆశీర్వచనం చివరి శుభాలు

నిత్య నిబంధన యొక్క రక్తం ద్వారా గొర్రెల గొప్ప కాపరియైన, ప్రభువైన యేసును మృతులలో నుండి తిరిగి వెనుకకు తెచ్చిన సమాధానకర్తయైన దేవుడు, తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి మంచిదానితో మిమ్మల్ని సిద్ధపరచును గాక, ఆయనకు ఇష్టమైనదాన్ని యేసు క్రీస్తు ద్వారా ఆయన మనలో జరిగించుగాక, ఆయనకే నిరంతరం మహిమ కలుగును గాక ఆమేన్.

సహోదరీ సహోదరులారా! నా హెచ్చరిక మాటను భరించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను, వాస్తవానికి నేను మీకు చాలా క్లుప్తంగా వ్రాశాను.

మన సహోదరుడైన తిమోతి చెరసాల నుండి విడుదల అయ్యాడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అతడు త్వరగా వస్తే, నేను మిమ్మల్ని చూడడానికి అతనితో కలిసి వస్తాను.

మీ నాయకులందరికి, పరిశుద్ధులందరికి వందనాలు తెలియజేయండి.

ఇటలీ దేశపు సహోదరులు మీకు వందనాలు తెలియజేస్తున్నారు.

కృప మీ అందరితో ఉండును గాక.

Source notes (2)
  1. Footnote ద్వితీ 31:6
  2. Footnote కీర్తన 118:6,7

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.