Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

యోనా 2

యోనా ప్రార్థన

ఆ చేప కడుపులోనుంచి యోనా యెహోవాకు ఇలా ప్రార్థించాడు,

“నా ఆపదలో నేను యెహోవాకు మొర్రపెట్టాను.

ఆయన నాకు జవాబిచ్చాడు.

మృత్యులోకం నుంచి నేను కేకలు వేస్తే నువ్వు నా స్వరం విన్నావు.

నువ్వు నన్ను అగాధంలో, సముద్రగర్భంలో పడవేశావు. ప్రవాహాలు నన్ను చుట్టుకున్నాయి.

నీ అలలూ తరంగాలూ నా మీదుగా వెళ్తున్నాయి.

నీ సన్నిధినుంచి నన్ను తరిమి వేసినా,

నీ పరిశుద్ధాలయం వైపు మళ్ళీ చూస్తాను అనుకున్నాను.

నీళ్ళు నన్ను చుట్టుకోవడంతో నేను కొనప్రాణంతో ఉన్నాను.

సముద్రాగాధం నన్ను ఆవరించి ఉంది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది.

నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు నన్ను మూసివేశాయి.

పర్వతాల పునాదుల్లోకి నేను దిగిపోయాను.

నా దేవా, యెహోవా, నువ్వు నా జీవాన్ని అగాధంలో నుంచి పైకి రప్పించావు.

నా ప్రాణం నాలో కృశిస్తూ ఉంటే నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను.

నీ పరిశుద్ధాలయంలోకి నీదగ్గరికి నా ప్రార్థన చేరింది.

వ్యర్థమైన విగ్రహ దేవుళ్ళ మీద లక్ష్యం ఉంచేవాళ్ళు తమ కొరకైన నీ విశ్వాస్యతను నిరాకరిస్తున్నారు.

నా మట్టుకు నేను కృతజ్ఞతాస్తుతులతో నీకు బలి సమర్పిస్తాను.

నేను మొక్కుకున్న దాన్ని తప్పక నెరవేరుస్తాను.

యెహోవా దగ్గరే రక్షణ దొరుకుతుంది.”

అప్పుడు యెహోవా చేపకు ఆజ్ఞాపించగానే అది యోనాను పొడి నేల మీద కక్కి వేసింది.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.