Skip to content
BibleKenya

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

ద్వితీ 21

తెలియని హత్యకి పరిహారం

“మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోని పొలంలో ఒకడు చచ్చి పడి ఉండడం మీరు చూస్తే, వాణ్ణి చంపిన వాడెవడో తెలియనప్పుడు మీ పెద్దలూ, న్యాయాధిపతులూ వచ్చి, చనిపోయిన వ్యక్తి చుట్టూ ఉన్న గ్రామాల దూరం కొలిపించాలి. ఆ శవానికి ఏ ఊరు దగ్గరగా ఉందో ఆ ఊరి పెద్దలు ఏ పనికీ ఉపయోగించని, మెడపై కాడి పెట్టని పెయ్యను తీసుకోవాలి. దున్నని, సేద్యం చేయని ఏటి లోయ లోకి ఆ పెయ్యను తోలుకుపోయి అక్కడ, అంటే ఆ లోయలో ఆ పెయ్య మెడ విరగదీయాలి.

తరువాత యాజకులైన లేవీయులు దగ్గరికి రావాలి. యెహోవాను సేవించి యెహోవా పేరుతో దీవించడానికి ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. కనుక వారి నోటి మాటతో ప్రతి వివాదాన్ని, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యాన్ని పరిష్కరించాలి. అప్పుడు ఆ శవానికి దగ్గరగా ఉన్న ఆ ఊరి పెద్దలంతా ఆ ఏటి లోయలో మెడ విరగదీసిన ఆ పెయ్య మీద తమ చేతులు కడుక్కుని మా చేతులు ఈ రక్తాన్ని చిందించలేదు, మా కళ్ళు దీన్ని చూడలేదు. యెహోవా, నువ్వు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. నీ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మీద నిర్దోషి ప్రాణం తీసిన దోషాన్ని మోపవద్దు అని చెప్పాలి. అప్పుడు ప్రాణం తీసిన దోషానికి వారికి క్షమాపణ కలుగుతుంది.

ఆ విధంగా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది చేసేటప్పుడు మీ మధ్యనుంచి నిర్దోషి ప్రాణం కోసమైన దోషాన్ని తీసివేస్తారు.

బందీ అమ్మాయిలను పెళ్లి చేసుకోడం

మీరు మీ శత్రువులతో యుద్ధం చేయబోయేటప్పుడు మీ యెహోవా దేవుడు మీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ బందీల్లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమెను మోహించి, ఆమెను పెళ్లి చేసుకోడానికి ఇష్టపడి, నీ ఇంట్లోకి ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరం చేయించుకుని గోళ్ళు తీయించుకోవాలి. ఆమె తన ఖైదీ బట్టలు తీసేసి మీ ఇంట్లో ఉండే నెలరోజులు తన తల్లిదండ్రులను గురించి ప్రలాపించడానికి ఆమెను అనుమతించాలి. తరువాత నువ్వు ఆమెను పెళ్లిచేసుకోవచ్చు. ఆమె నీకు భార్య అవుతుంది. నువ్వు ఆమె వలన సుఖం పొందలేకపోతే ఆమెకు ఇష్టమున్న చోటికి ఆమెను పంపివేయాలే గాని ఆమెను వెండికి ఎంతమాత్రమూ అమ్మివేయకూడదు. మీరు ఆమెను అవమాన పరిచారు కాబట్టి ఆమెను బానిసగా చూడకూడదు.

జ్యేష్ఠత్వ అధికారం

ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలున్నప్పుడు అతడు ఒకరిని ఇష్టపడి, మరొకరిని ఇష్టపడకపోవచ్చు. ఇద్దరికీ పిల్లలు పుడితే, పెద్ద కొడుకు ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడైతే తండ్రి తనకున్న ఆస్తిని తన కొడుకులకు వారసత్వంగా ఇచ్చే రోజున ఇష్టం లేని భార్యకు పుట్టిన పెద్ద కొడుక్కి బదులు ఇష్టమైన భార్యకు పుట్టినవాణ్ణి పెద్ద కొడుకుగా పరిగణించకూడదు. ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి అతణ్ణి పెద్ద కొడుకుగా ఎంచాలి. ఇతడు అతని బలారంభం కాబట్టి జ్యేష్ఠత్వ అధికారం అతనిదే.

మొండివాడై తిరగబడ కొడుకుకు శిక్ష

ఒక వ్యక్తి కొడుకు మొండివాడై తిరగబడి తండ్రి మాట, తల్లి మాట వినక, వారు అతణ్ణి శిక్షించిన తరువాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోతే అతని తలిదండ్రులు అతని పట్టుకుని ఊరి గుమ్మం దగ్గర కూర్చునే పెద్దల దగ్గరికి అతణ్ణి తీసుకురావాలి. మా కొడుకు మొండివాడై తిరగబడ్డాడు. మా మాట వినక తిండిబోతూ తాగుబోతూ అయ్యాడు, అని ఊరి పెద్దలతో చెప్పాలి. అప్పుడు ఊరి ప్రజలంతా రాళ్లతో అతన్ని చావగొట్టాలి. ఆ విధంగా చెడుతనాన్ని మీ మధ్యనుంచి తొలగించిన వాడివౌతావు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ సంగతి విని భయపడతారు.

మరణశిక్ష పొందేటంత పాపం ఎవరైనా చేస్తే అతణ్ణి చంపి మాను మీద వేలాడదీయాలి. అతని శవం రాత్రి వేళ ఆ మాను మీద ఉండనియ్యకూడదు. వేలాడదీసినవాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు కనుక మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిస్తున్న దేశం అపవిత్రం కాకుండా ఉండేలా అదే రోజు ఆ శవాన్ని తప్పకుండా పాతిపెట్టాలి.”

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019. Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.